ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాల్లో పండగ డిమాండ్ కొనసాగుతోంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో 1,53,000 ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 43,000 అమ్మకాలు మాత్రమే జరిగాయని వాహన డేటా వెల్లడించింది. నవంబర్ 2022లో 76,150 ఈవీ టూవీలర్స్ అమ్మకాలు జరిగాయి. 2021 నవంబర్‌లో వీటి అమ్మకాలు 23,099 మాత్రమే. అక్టోబర్ 2022లో 77 వేల ఈవీ టూవీలర్స్ అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 19,702 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి.
ఈ డిసెంబర్‌లోనూ ఇదే స్థాయిలో అమ్మకాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటితో పాటు 2023లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని ప్రధాన కంపెనీలు ఈవీ టూ వీలర్స్ ఉత్పత్తిని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రస్తుతం రోజుకు 1000 యూనిట్ల తయారీ నుంచి 3 వేలకు పెంచుతున్నట్లు సీఎఫ్ఓ జీఆర్ అరుణ్ కుమార్ తెలిపారు. 2023 మార్చి నుంచి ఉత్పత్తి పెంచుతున్నట్లు తెలిపారు. కంపెనీ ప్రస్తుతం సంవత్సరానికి ఓలా ప్లాంట్లు 2-2.5 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్నాయని తెలిపారు.
ఓలా త్వరలోనే సెల్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు అరుణ్ కుమార్ వెల్లడించారు. దీంతో పాటు త్వరలోనే ఓలా విద్యుత్ కార్ల తయారీ ప్లాంట్ నిర్మాణం సైతం 2023లోనే ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ సంవత్సరం నాటికి టూ వీలర్స్ డిమాండ్ మరింత పెరగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఎథర్ ఎనర్జీ ఈవీ టూ వీలర్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. అక్టోబర్‌లో 8,200 ఇ-స్కూటర్లను అమ్మిన సంస్థ నవంబర్‌లో 7,200 యూనిట్లను విక్రయించింది. ఇటీవల కాలంలో ఈవీ టూ వీలర్స్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఎథర్ ఎనర్జీ తెలిపింది. హోస్సూర్లో రెండో తయారీ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. రానున్న కాలంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపింది. టీవీఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐ క్యూబ్ అమ్మకాలు నవంబర్‌లో 7,754 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు గతం కంటే గణనీయంగా పెరిగాయి.
ద్రవ్యోల్బణం ప్రభావంతోనే వినియోగదారులు ఎలక్ట్రికల్ టూవీలర్స్ కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ వాహనాల కంటే విద్యుత్ వాహనాల నిర్వహణా వ్యయం చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లోనూ ఎక్కువగా ఎంట్రీ లెవల్ అంటే తక్కువ రేటులో వచ్చే వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటికీ చాలా కంపెనీలు తమ వాహనాల రేట్లను లక్ష కంటే ఎక్కువగానే పెట్టారు. ఇటీవలే ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో 80 వేల రేటులో ఇ-స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌తో మార్కెట్ వాటా పెంచుకోవాలని ఓలా ప్రయత్నిస్తోంది.