అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018-22 తేటతెల్లం చేసింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో పులుల జనాభా 47 నుండి 75కి పెరిగింది. అంటే గతంలోకంటే ఇది 69 శాతం పెరుగుదలగా నమోదైంది. ఈక్రమంలోనే అటవీశాఖాధికారులు రాబోయే నాలుగేళ్లలో పులుల సంఖ్య విపరీతంగా పెరగడానికి వీలుగా పులుల నివాసాలను మెరుగుపరుస్తున్నారు. 2022లో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు పాపికొండ నేషనల్ పార్క్‌లో నిర్వహించిన జాతీయ పులుల గణన వాటి జనాభా లెక్కలను తేల్చింది. ఈ లెక్కల ప్రకారం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ఒ రిజర్వ్‌లో 73 పులులు ఉండగా, పాపికొండ నేషనల్ పార్క్‌లో రెండు పులులు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో మొత్తం పులుల సంఖ్య 75కి చేరుకుందని వెల్లడించింది.
అతిపెద్ద ఎన్ఎస్టీఆర్..
రాష్ట్రంలో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ జోన్ దాదాపు 3,528 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, పాపికొండ నేషనల్ పార్క్ 1,013 చ.కి.మీ.లో విస్తరించి ఉంది. ఈఎన్ఎస్టీఆర్ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ జోన్‌గా గుర్తింపు పొందింది. ఈప్రాంతంలో కలుపు మొక్కల ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపట్టేలా అటీవీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పులుల జనాభాలో ఇంత గణనీయమైన పెరుగుదల నమోదును చూసిన తరువాత అటవీ అధికారులు ఇప్పటికే ఉన్న పులుల జనాభాను కొనసాగించడంతోపాటు వాటి జనాభా పెరుగుదలను సులభతరం చేయడం అనే జంట లక్ష్యాలతో పులుల నివాస మెరుగుదల కార్యక్రమాన్ని రూపొందించారు.
కార్యాచరణ ఇలా..
అటీవీ ప్రాంతాలు, పులులు నివాస ప్రాంతాలుగు ఉన్న చోట్ల అన్నిరకాల ఇతర కలుపు మొక్కలను తొలగించడం ద్వారా పొడవైన గడ్డిని వేగవంతంగా పెరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిద్వారా ఇది మంచి మేతగా తయారవడంతోపాటు పులులకు ఆశ్రయాన్ని అందించడంలో సహాయపడుతుంది. ముందుగా చిన్న చిన్న మొక్కల నివారణకు అనవసరమైన చర్యల్లో భాగంగా వాటిని కాల్చివేయనున్నారు. అదే సమయంలో వేసవిలో అడవి మంటలను నివారించడానికి ఫైర్లైన్లను తయారు చేస్తున్నారు. పొడవాటి గడ్డి పెంపకం ద్వారా శాకాహారుల జనాభా పెరుగుదలను సులభతరం చేస్తాయని, దీనిద్వారా మాంసాహారులకు ప్రధానంగా పులులకు మంచి ఆహారం దొరుకుతుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా అవి ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో దోహదపడతాయని, దీనిద్వారా వాటి జనాభా పెరుగుదలకు సహాయపడుతుందని వారు అంటున్నారు.
సరిహద్దు గ్రామాల్లోకి చొరబడకుండా..
ఈక్రమంలోనే అటవీ అధికారులు సాసర్ పిట్స్ వంటి నీటి వనరులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అటవీ సరిహద్దు గ్రామాలలో మానవ నివాసాలలోకి పులులు రాకుండా నిరోధించడానికి ఇవి సహాయపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. కట్టలు సేకరించే సమయంలో లోతైన అటవీ ప్రాంతంలో ఒక గ్రామస్థుడిపై పులి దాడి చేసిన సందర్భం మినహా, ఈ మధ్య కాలంలో ఎన్‌ఎస్‌టీఆర్‌లో మనుషులపై పులి దాడి జరిగినట్లు ఎక్కడా నమోదు కాలేదు. అయితే, అక్కడక్కడా పులులు మానవ నివాసాలలోకి వెళ్లి పశువులపై దాడి చేసిన కొన్ని కేసులు నమోదయ్యాయి. అటవీశాఖాధికారులు ముఖ్యంగా ఎన్‌ఎస్‌టీఆర్‌లో అక్రమ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎలక్ట్రానిక్ నిఘా ఉంచడంతోపాటు హాని కలిగించే ప్రాంతాల్లో రెగ్యులర్ ఫుట్ పెట్రోలింగ్‌ను చేపట్టడం ద్వారా యాంటీ-పోచింగ్ డ్రైవ్‌ను తీవ్రతరం చేయనున్నారు.