Thursday, November 21, 2024

కోవిడ్ వ్యాక్సిన్లతో పెరిగిన రోగనిరోధక శక్తి.. ఎంపీ నామా ప్రశ్నలకు కేంద్రమంత్రుల జవాబులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కోవిడ్ నియంత్రణకు వేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందని కేంద్రం తెలిపింది. ప్రజలపై కోవిడ్ వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం, వాటి దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించాలనుకుంటుందా అని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు లోక్‌సభలో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్న చర్యలేంటి? ఇలాంటి మహమ్మారిలను ఎదుర్కోవడానికి కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికలేంటో తెలపాలని కోరారు.

కేంద్ర వైద్య, ఆరోగ్య సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆయన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఐసీఎంఆర్ 2021 మే, జులై నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్లుపై వివిధ కేంద్రాలు, విభిన్న ఆస్పత్రుల్లో కేస్ కంట్రోల్ స్టడీ నిర్వహించిందన్నారు. వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత కోవాగ్జిన్ 71 శాతం, కోవిషీల్డ్ 85 శాతం సామర్ధ్యాన్ని చూపుతున్నట్లు పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి, రోగ నిరోధక శక్తి పెంపొందడానికి బూస్టర్ డోస్ సురక్షితమైనదని, అవసరమని కూడా అధ్యయానాల్లో తేలిందని కేంద్రమంత్రి చెప్పారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపులను బట్టి హైదరాబాద్ ప్రాంతీయ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజావసరాల దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే రింగ్ రోడ్డుకు సంబంధించిన భూకరణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించి, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తుందా? ఈ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందని నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు.

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆయన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ ప్రాజెక్టు రెండు భాగాలుగా నిర్మితమవుతోందని చెప్పారు. భారతమాల ఫేజ్ 1 కింద చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. చౌటుప్పల్ – షాద్ నగర్ – సంగారెడ్డి రెండో భాగానికి సంబంధించిన డీపీఆర్ తయారీ పనులు చేపట్టినట్లు నితిన్ గడ్కరీ జవాబులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement