హైదరాబాద్, ఆంధ్రప్రభ : అనాధిగా వ్యవసాయ రంగానికి ఆధారాలైన చెరువుల పునరుద్ధరణ తెలంగాణ ఉద్యమ అకాంక్ష. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు,ఆసఫ్ జాహీలు నిర్మించిన చెరువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురై వేలాధి చెరువులు కబ్జాల్లో కనుమరుగైతే తెలంగాణ ఉద్యమ అకాంక్షల్లో పునరుద్ధరణ అంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే ప్రప్రథమంగా సీఎం కేసీఆర్ మనఊరు మనచెరువు పేరుతో ప్రారంభించిన మిషన్ కాకతీయ ఫలాలను నేడు ప్రజలు అందుకుంటున్నారు. పునరుద్ధరించిన వేలాధి చెరువులు భూగర్భ జలాలను గణనీయంగా పెంచడంతో 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ జరిగింది.
పెరిగిన భూగర్భజలాలు వ్యవసాయరంగానికి బాసటగా నిలిచి బోర్లు నీళ్లతో హోరెత్తుతుండటంతో ఉద్యమ అకాంక్ష సఫలీకృతమై వ్యవసాయం తెలంగాణలో పండుగైంది. 2015 మార్చి12న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పాతచెరువులో మిషన్ కాకతీయను ముఖ్యమంత్రి కేసీఆర్ శంకు స్థాపన చేయడంతో పాటుగా మంత్రి హరీష్ రావుతో కలిసి మట్టి పనిచేసి ప్రజలు, పాలకవర్గంలో ఉత్సాహాన్ని కలిగించారు. ఆనాటి నుంచి ఐదు విడతలుగా 46 వేల 531 చెరువులు పూడికతీసి భూగర్భజలాలను పెంచారు. చెరువుల్లో దశాబ్దాల తరబడి పేరుకుపోయిన మట్టిని తీసి పొలాల్లో ఎరువుగా వేయడంతో పంటల దిగుబడి పెరిగింది.
కాకతీయుల చెరువులు… కేసీఆర్ పరిరక్షణ
దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయాన్ని పునరుద్ధరించేందుకు నిర్మించిన చెరువులు 1956 నాటికి 70వేలు ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ఆసంఖ్య గణనీయంగా తగ్గింది. మిగిన చెరువుల్లో పూడికతీయకపోవడంతో భూగర్భ జలాలజాడలు కనుమరుగయ్యాయి. సప్తవసంతాల్లో చెరువుల నిర్మాణం పుణ్య కార్యంగా భావించిన కాకతీయులు ప్రతిగ్రామంలో చెరువులు నిర్మించి వ్యసాయాన్ని ప్రోత్సహించారు. నాటి వరంగల్ రాజ్యంలోని వ్యవసాయ పంటలు మోటుపల్లి రేవు ద్వారా విదేశాలకు ఎగుమతు చేసేవారు. 1323 లో కాకతీయ రాజ్యం అంతరించడంతో ఆతర్వాత పాలకులు జలాశయాల నిర్మాణానికి అంతప్రాముఖ్యత ఇవ్వకున్నా కొన్నింటిని నిర్మించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.
అయితే కాలక్రమేణ వందలాధిసంవత్సరాలనుంచి పునరుద్ధరణకు నోచుకోని చెరువులను సీఎం కేసీఆర్ పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తననివేదికల్లోను పొందుపర్చడం గమనీయం. మిషన్ కాకతీయలో గుర్తించిన చెరువుల వివరాలను పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లాలో 28, ఖమ్మం 4.571,ఆదిలాబాద్ 3.951, నిజమాబాద్ 3.251, కరీంనగర్ 5.939, మెదక్ 7.941, నల్గొండ 4.262, మహబూబాబాద్ 7.480,మహబూబ్ నగర్ లో దశలవారిగా వందలాధి చెరువులను గుర్తించి మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈచెరువుల్లో మొదటివిడత 8.003, రెండవ విడతలో 8.927, మూడవ విడతలో 5.886, నాలుగవ విడతలో 6.000, మిగతావి మూడవ విడతలో పునరుద్దరణ జరిగాయి. సుమారు రెండులక్షల కోట్ల అంచనావ్యవయంతో మిషన్ కాకతీయ పనులు జోరుగా సాగాయి. నిజాం కాలంలో 70వేల చెరువుల్లో 25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తే నేడు 46 వేల531 చెరువులతో 25 లక్షలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగంది.
మిషన్ కాకతీయతో పెరిగిన భూగర్భజలాలు
యుద్ధప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మిషన్ కాకతీయతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 2020 తో పోల్చుకుంటే ప్రస్తుతం2022 అక్టోబర్ నాటికి భూగర్భ జలాలు 16.63 శతకోటి ఘనపు మీటర్ల నుంచి 21. 11 శతకోటి ఘనపుమీటర్ల వరకు పరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తననివేదికలో వెల్లడించింది.డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఆఫ్ ఇండియా 2022 నివేదిక వెల్లడించింది. భూగర్భంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూగర్భ జలాల్లో 19.25 శతకోటి ఘనపు మీటర్ల నీటిని తోడుకోవడానికి అవకాశాలున్నాయని నివేదికలో పొందుపర్చారు. అయితే తెలంగాణ లో వివిధ రిజర్వాయర్లలో కూడా పుష్కలంగా నీరు ఉండటంతో 8 శకోటి ఘనపు మీటర్లు అంటే 41. 6 శాతాన్ని మాత్రమే బోర్ల ద్వారా వినియోగించుకునేందుకు సాగునీటి పారుదలశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
రిజర్వాయర్లతోపాటుగా వేలాధి చెరువుల్లో జలకళ ఉట్టి పడటంతో తెలంగాణ వాటర్ బ్యాంక్ గా అవరించేందుకు అనేక అనుకూల పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి. అయితే రిజర్వాయర్ల నిర్మాణాలతో భూగర్భ జలాలు 53.32 శాతం వినియోగం నుంచి 41 శాతానికి తగ్గిపోవడం శుభరిణామంగా ప్రభుత్వం భావిస్తుంది. సాగునీటి అవసరాలకోసం ఉపరితల జలాల లభ్యత పెరగడం పట్ల నీటి పారుదలశాఖ ఆనందం వ్యక్తం చేస్తుంది. అయితే భూగర్భ జలాల పెరుగుదల తో స్వచ్ఛమైన నీరు భూమిపొరల్లో నిండుకుంది. భవిష్యత్ తరాల నీటి అవసరాలకోసం పొదుపు అనివార్యంగా భావించి ఉపరితల నీటి లభ్యత పై ప్రభుత్వం దృష్టి సారించడంతో క్రమేణ బోర్ల ప్రాధాన్యత తగ్గడం శుభ పరిణామం.