Thursday, November 21, 2024

Big story : తెలంగాణలో పెరిగిన విద్యుత్‌ వినియోగం.. పెరిగిన గృహా, వ్యవసాయ, పరిశ్రమల విద్యుత్‌ కనెక్షన్లు !

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతం విద్యుత్‌ కోతలతో అంధకారకం అవుతుందని, ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి పాలకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం పటా పంచలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ వినియోగంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు 24 గంటల పాటు అందిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరగడంతో పాటు విద్యుత్‌ కనెక్షన్లను అధిక సంఖ్యలో పెరిగాయి. అయినప్పటికి సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో విద్యుత్‌ కాంతులు నిరంతరం వెలుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పాడే నాటికి తెలంగాణలో గరిష్ట డిమాండ్‌ కేవలం 6,661 మెగావాట్ల డిమాండ్‌ మాత్రమే ఉంటే.. 2022 మార్చి 29 వరకు 14,160 మెగావాట్ల డిమాండ్‌ వరకు పెరిగింది. అంటే అదనంగా 7,490 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ పెరడంతో మొత్తంగా 112.42 శాతం అదనంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణి సంస్థల పరిధిలో విద్యుత్‌ కనెక్షన్లు 1 కోటి 5 లక్షలు ఉండగా, వీటిలోనే 13.47 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు కూడా కలిసి ఉన్నాయి.

రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ ( టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ( ఎన్‌పీడీసీఎల్‌) విద్యుత్‌ పంపిణి సంస్థలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ పరిధిలోనే అధికంగా విద్యుత్‌ వినియోగం జరుగుతోందని సంబంధిత సంస్థల లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో పరిశ్రమలు, వివిద సంస్థలు ఎక్కువగా ఉండటం వల్ల గ్రేటర్‌ పరిధిలో విద్యుత్‌ వాడకం ఎక్కువగానే నమోదవుతోంది. రాష్ట్ర విభజనకు ముందు ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 4,989 మెగావాట్ల కరెంట్‌ వినియోగం కాగా, ఇప్పుడు 8,792 మెగావాట్ల డిమాండ్‌కు చేరుకున్నది. అంటే రాష్ట్ర విభజన తర్వాత అదనంగా దక్షిణ తెలంగాణ పరిధిలో 3,803 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం పెరిగి 76.23 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రాష్ట్ర విభజనకు ముందు 2,261 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా, ఇప్పుడు 3,435 మెగావాట్ల విద్యుత్‌ ఖర్చు అవుతోంది. అదనంగా 1,174 మెవాట్లతో 51.92 శాతం వృద్ధి నమోదుతో ఎస్పీడీసీఎల్‌ ముందుకువెళ్లుతోంది.

283.38 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఖర్చు..

ఇక మిలియన్‌ యూనిట్లలో చూసినట్లయితే రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో 144.1 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఖర్చు అయితే.. ప్రస్తుతం 283.38 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. అదనంగా తెలంగాణ రాష్ట్రంలో 139.28 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఖర్చుతో 96.66 శాతం వృద్దిని తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థలు సాధించాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 101.72 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఖర్చు కాగా, ఇప్పుడు 180.51 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారులు ఖర్చు చేస్తుండటంతో అదనంగా 78.79 మిలియన్‌ యూనిట్ల ఖర్చుతో 77.46 శాతం మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఖర్చ నమోదవుతోంది.

కేటగిరీల వారిగా విద్యుత్‌ వినియోగదారుల సంఖ్య..

- Advertisement -

కేటగిరి – సర్వీసుల సంఖ్య – శాతం – విద్యుత్‌ ఖర్చు(మిలియన్‌ యూనిట్లలో)
డొమొస్టిక్‌- 77,73,712 – 73.87 – 9335.21
కమర్షియల్‌- 11,61,157 – 11.03 – 2815.92
ఎల్టి ఇండస్ట్రీయల్‌- 68,165 – 0.65 – 892.18
వ్యవసాయం- 13,47,155 – 12.80 – 11,724.36
ఇతరులు(ఎల్టి)- 1,61,725 – 1.54 – 614.90
ఎల్టి కేటగిరి మొత్తం- 1,05,11,914 – 99.90 – 25034.99
హెటీ కేటగిరి మొత్తం- 10,902 – 0.10 – 17,545.03

Advertisement

తాజా వార్తలు

Advertisement