Saturday, November 23, 2024

వర్షాలు తగ్గడంతో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌!

హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌: ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 55 లక్షలకుపైగా ఉన్న విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా కోసం 33కేవీ సబ్‌స్టేషన్లు 340లకుపైగా ఉన్నాయి. గత నెలన్నర నుంచి వర్షాల ప్రభావంతో ఏసీలు, ఫ్యాన్ల వాడకం తగ్గడంతో విద్యుత్‌ డిమాండ్‌ 43మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. అయితే గత వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండలు వస్తుండడంతో తిరిగి ఫ్యాన్లు, ఏసీలకు పని పెరిగింది. గత వారం రోజులుగా విద్యుద్‌ డిమాండ్‌ 46 మిలియన్‌ యూనిట్ల నుంచి 54 మిలియన్‌ యూనిట్ల మధ్య ఉంది.

ఈసారి ఎండాకాలంలో రికార్డు స్థాయిలో 72 మిలియన్‌ యూనిట్లకు చేరుకున్న విద్యుత్‌ డిమాండ్‌ వర్షకాలం వచ్చే సరికి 30శాతం డిమాండ్‌ తగ్గిపోయి కేవలం 43 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. ప్రస్తుతం తిరిగి 54 మిలియన్‌ యూనిట్లకే పరిమితమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ డిమాండ్‌ వర్షాల ప్రభావంతో 2400 మెగావాట్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయి 2,900 మెగావాట్లకు చేరుకుంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే సుమారుగా 500 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement