Friday, November 22, 2024

పత్తి పెరిగిన డిమాండ్​.. మద్దతు ధరకంటే 2వేలు అదనంగా చెల్లిస్తున్నవ్యాపారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఆరంభంలోనే పత్తి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిని దిగుబడి తగ్గిపోయిందన్న ఆందోళనలో ఉన్న రైతులకు ధర ఉపశమనం కలిగిస్తోంది. ఈ ఏడాది పత్తి పంట రైతులకు సిరులు కురిపించడం ఖాయమన్న ధీమా రైతులతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మొదటిసారి ఏరిన (ఫస్ట్‌ పికింగ్‌) పత్తి ఇప్పుడిప్పుడే వ్యవసాయ మార్కెట్లలోకి వస్తోంది. మార్కెట్‌లకు వచ్చిన పత్తిని వ్యాపారులు మద్దతు ధరకు మించి చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా పత్తికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను రూ.6380 గా నిర్ణయించింది. అయితే మార్కెట్‌కు వస్తున్న పత్తి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. మద్దతు ధరకు రూ.2వేలు అదనంగా చెల్లించి మరీ వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. భారీ వర్షాలకు తేమతో కూడిన పత్తికే మద్దతు ధరకంటే రెండు వేలు అధనంగా చెల్లిస్తే రాబోయే రోజుల్లో వచ్చే పత్తి ధర క్వింటాకు రూ.10వేలు దాటుతుందని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ మార్కెట్‌లో శుక్రవారం క్వింటా పత్తి ధర రూ.8300పలికింది. వరంగల్‌ మార్కెట్‌లో అత్యధికంగా కింటా పత్తి ధర రూ.8330గా ఉండగా, తక్కువలో తక్కువ రూ.7600కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వేలంలో రూ.7800 నుంచి వ్యాపారులుధర ప్రారంభించారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో సహజంగానే పత్తిలో 20శాతానికి పైగా తేమ వస్తోంది. గతేడాది పత్తి క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో 10వేలకు పైగా ధర పలికింది. ఈ ఏడాది అంతకు మించి ధర లభించే అవకాశం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా రైతులు వరి సాగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో సాగు చేసిన చోట్ల భారీ వర్షాల కారణంగా పత్తి చేలు ఆశించిన మేర ఎదగకపోగా పూత, కాత కూడా తగినస్థాయిలో నిలవలేదు. భారీ వర్షాలకు పూత రాలిపోవడంతోపాటు కాసిన ఒకటి రెండు కాయలు కూడా నలుపురంగులోకి మారి మురిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా పత్తి మొక్కలు కూడా రెండు ఫీట్ల కు మించి పెరగలేదు. ఈ పరిస్థితుల్లో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement