హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇరిగేషన్, వ్యసాయ రంగాలకు ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యత, ఆయా రంగాలపై పెట్టుబడుల నేపథ్యంలో రాష్ట్ర అప్పుల భారం పెరుగుతోంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అప్పు కొంత మేర పెరుగుతోంది. 2015-16 ఏడాదిలో రూ.93,115కోట్లుగా ఉన్న అప్పులు తాజాగా 2023-24లో రూ.3,22,992కోట్లకు చేరనున్నాయి. ఈ ఏడాది ఓపెన్ మార్కెట్ రుణాలు రూ.40,615కోట్లు, కేంద్ర ప్రభుత్వంనుంచి రుణాలు రూ.4102కోట్లు, ఇతర రుణాలు రూ.1500 కోట్లు, డిపాజిట్లపై రుణాలు రూ.4వేల కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది.
దీంతో ఈ ఆర్ధిక ఏడాదిలో రుణాల మొత్తం రూ.3,22,992 కోట్లకు చేరుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా స్వంత పూచీకత్తుతో మరిన్ని రుణాలను బడ్జెట్‌లో పేర్కొనకుండానే సేకరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించుకుంది. దీంతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల వంటి ప్రతిష్టాత్మక పథకాలకు బైటినుంచే రుణాలను సేకరించనున్నారు.