కరోనా మహమ్మారి ప్రతికూల పరిస్థితులతో వేతన జీవుల వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు కరోనా కాలంలో వైద్యవ్యయాలు అధికమయ్యాయి. క్లిష్టతరమైన ఈ పరిస్థితుల్లో బడ్జెట్ 2022-23పై ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆదాయ పన్ను స్లాబులు పెంచడం, వర్క్ ఫ్రం హోంకి అలవెన్సులు, ప్రామాణిక మినహాయింపులు పెంచడంతోపాటు ఇతర ఉపశమనాలను కోరుకుంటున్నారు.
వర్క్ ఫ్రం హోంకి అలవెన్స్
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు హోం అలవెన్స్‌లు ప్రకటించాలని ఐటీ రంగ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోం చేసేవారికి అదనంగా రూ.50 వేల బోనస్ ఇవ్వాలని డెలాయిట్ ఇండియా కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి. అన్ని వ్యాపారాల్లోనూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు అదనపు వ్యయాలు పెరిగాయి. ఇంటర్నెట్ ఛార్జీలు, రెంట్, విద్యుత్ బిల్లు, ఫర్నీచర్ వంటి వర్క్ ఫ్రం హోంకు సంబంధించిన వ్యయాలు అధికమయ్యాయి. కాబట్టి ఉద్యోగులకు అలవెన్సుల అవసరం ఉందని డెలాయిట్ ఇండియా పేర్కొంది. కాగా అధిక పన్ను రేటు పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచే అవకాశాలున్నాయని డెలాయిట్ ఇండియా పేర్కొంది. వ్యక్తిగత పన్ను రేట్లను కార్పొరేటు పన్ను రేట్లకు సమాంతరంగా ఉంచేందుకు అత్యధిక పన్ను రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని డెలాయిట్ ఇండియా సూచించింది. ప్రతిపాదితక అత్యధిక ట్యాక్స్ రేటు(సర్ఛార్జ్, సెస్ సహా) 42.7 శాతం నుంచి 35.6 శాతానికి తగ్గించాలని డెలాయిట్ ఇండియా కోరింది.
మరింత సులభంగా పన్నులు
సేవింగ్స్ కేటగిరికి సంబంధించి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టింది. వేతన జీవులకు మరిన్ని పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తూ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే వేతనజీవుల పెట్టుబడులను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా పన్నుల సంస్కరణలను ప్రవేశ పెట్టాలని ఉద్యోగ వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
యూనివర్సల్ హెల్త్ కేర్
కరోనా నేపథ్యంలో ప్రతి భారతీయుడికీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ రంగంలో ప్రోత్సాహకాల ద్వారా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ దిశగా ప్రభుత్వ అడుగులు వేసే అవకాశాలున్నాయని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పన్ను మినహాయింపుల పరిమితి పెంపు, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపుల ద్వారా ప్రభుత్వం చేయూతనిచ్చే అవకాశాలున్నాయని అన్నారు. ఈ బడ్జెట్లో సామాజిక భద్రత పెంపునకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని అరుణ్ సింగ్ అంచనా వేశారు.
గృహ రుణాలపై మరిన్ని ప్రయోజనాలు
గృహ రుణాలపై రీపేమెంట్ల విషయంలో వార్షిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న ఇళ్ల కొనుగోలుదార్లకు ఆదాయం చట్టంలోని సెక్షన్ 80సీ కింద ప్రయోజనాలు అందుతున్నాయి. అయితే బడ్జెట్ 2022-23లో ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80ఈఈ, 80ఈఈఏ, 24(బీ) కింద లభిస్తున్న మినహాయింపులను మరింత పెంచే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.
ఎస్డీఎస్ పరిమితి పెంపు
బడ్జెట్ 2022లో ప్రామాణిక మినహాయింపుల పరిమితి(స్టాండర్ట్ డిడక్షన్ లిమిట్)ని ప్రభుత్వం పెంచుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుత పరిమితి రూ.50 వేలుగా ఉంది. 2019 మధ్యంతర బడ్జెట్లో ఈ పరిమితిని ప్రవేశపెట్టారు. అంతకుముందు 2020లో ఈ పరిమితి రూ.40 వేలగా ఉండేది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..