దేశంలో పలు రంగాల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య 2.27 లక్షలు (21.9 శాతం) పెరిగారు. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, ఇ-కామర్స్, తయారీ రంగాల్లోనే ఈ తరహా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫేడరేషన్ (ఐఎస్‌ఎఫ్) ప్రకటించిన ఒక నివేదికలో తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఒప్పంద ఉద్యోగులు 3.6 శాతం మాత్రమే ఉన్నారని నివేదిక వెల్లడించింది. కరోనా మూలంగానే ఒప్పంద ఉద్యోగుల సంఖ్య 21.9 శాతం పెరిగిందని తెలిపింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ రానున్న పండుగల సీజన్‌లో ఒప్పంద ఉద్యోగాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు లోహిత్ భాటియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌ఎంసీజీ, ఇ-కామర్స్, తయారీ రంగం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఇంధన రంగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయా రంగాల్లో డిజిటలీకరణ పెరగడం వల్ల కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సేవలు, సాంకేతిక, ఐటీ రంగాలు, మౌలిక వసతులు, ఐటీ అనుబంధ రంగాల్లోనూ ఈ తరహా ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందని ఈ నివేదికలో అంచనా వేశారు. ఐఎస్‌ఎఫ్‌లో సభ్యత్వం ఉన్న కంపెనీలు 2.27 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. దీంతో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్య 12.6 లక్షలకు చేరింది. ఈ రంగంలో 27 శాతం మంది మహిళలు ఉన్నారు. గతంలో బయటకు వెళ్లి అమ్మకాలు జరిపే ఉద్యోగాలు ఎక్కువగా ఉండేవి, ప్రస్తుతం అ్యవసర వస్తువుల డెలివరీ సేవల రంగాల్లో ఉద్యోగులకు ప్రాధాన్యత పెరిగింది. ఇలా కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు చేసే వారిలో 40 శాతం మంది 25-30 సంవత్సరాల వయస్సు ఉన్న వారే ఉన్నారు. ఎలాంటి ఉద్యోగ భద్రతలేని ఇలాంటి ఒప్పంద ఉద్యోగాలు పెరగడం పట్ల సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గిపోవడం వల్లే యువత ఇలా ఒప్పంద ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని, ఇలాంటి ఉద్యోగాల్లో సామాజిక భద్రతకు అవకాశంలేదని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇది తరహా ఉద్యోగాలు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగించదని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.