ఆగస్టు నెల ప్రారంభమవడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.8.50 మేర స్వల్పంగా పెంచాయి. సవరించిన ధర నేటి నుంచే (ఆగస్టు 1) అమల్లోకి వచ్చిందని కంపెనీలు స్పష్టం చేశాయి.
సవరించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల ఎల్పిజి సిలిండర్ ధర రూ.6.50 మేర పెరిగి రూ.1646 నుంచి రూ. 1652.50కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ డేటా పేర్కొంది. కోల్కతాలో రూ.8.50 మేర పెరిగి రూ.1764.50కి చేరింది. సవరించిన ధరలు ముంబైలో రూ.1605, చెన్నైలో రూ.1817గా ఉన్నాయి. రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.
కాగా 14 కేజీల గృహవినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులేదు. ధరలు యథాతథంగా ఉంటాయని కంపెనీలు తెలిపాయి. 14.2 కేజీల నాన్-సబ్సిడీ గ్యాస్ ధరలు ఢిల్లీలో రూ.803, కోల్కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉన్నాయి.