Saturday, November 23, 2024

మ‌ళ్లీ పెరిగిన బ‌స్ చార్జీలు.. ఆ టికెట్‌పై ఏకంగా 20 పెంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికులపై చార్జీల భారాన్ని విడతల వారిగా బాదుతున్న ఆర్టీసీ తాజాగా ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ (టిఎవైఎల్‌) 24 టికెట్‌ ఛార్జీలను మరోసారి పెంచింది. సేఫ్టీ, డీజిల్‌ సెస్‌ల వల్ల సాధారణ టికెట్ల ధరలు రూ.5 నుంచి 10 వరకు పెరగడంతో ట్రావెల్‌ 24 టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన టీఎస్‌ ఆర్టీసీ ధరలను పెంచింది. ఆ టికెట్‌పై ఏకంగా రూ.20ను పెంచేసింది. ప్రస్తుతం ట్రావెల్‌ 24 ధర రూ.100 ఉండగా తాజా పెంపుతో రూ.120కి చేరింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంపు విషయాన్ని ఆయా డిపోలకు తెలిపి టిమ్స్‌ మిషన్‌లను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ట్రావెల్‌ 24 టికెట్‌ తీసుకుంటే హైదరాబాద్‌ నగరంలో 24 గంటలపాటు ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుంది.

మరోవైపు నైట్‌ రైడర్స్‌ పేరుతో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత గ్రేటర్‌ ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సర్వీసులు విజయవంతం కావడంతో మరిన్ని రూట్లలో ఈ సర్వీసులను నడపనుంది. త్వరలో సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌, బోరబండ, మణికొండ ప్రాంతాలకు 24 గంటల బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ – పటాన్‌చెరు, చార్మినార్‌, సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, చాంద్రాయణగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ మధ్య నైట్‌ రైడర్స్‌ సర్వీసులు నడుపుతున్నారు. సికింద్రాబాద్‌-పటాన్‌చెరు మధ్య రాత్రి 12.50, 1.20, 2.25, 3.30, సికింద్రాబాద్‌-చార్మినార్‌ 22.40, 12.20, 2.00, చార్మినార్‌-సికింద్రాబాద్‌ రాత్రి 23.25, 1.05, 2.45, సికింద్రాబాద్‌-సీబీఎస్‌ మధ్య రాత్రి 3.55, సీబీఎస్‌ – సికింద్రాబాద్‌ తెల్లవారు జాము 4.45, అఫ్జల్‌గంజ్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌కు ఉదయం 4 గంటల వరకు నడుస్తున్నాయి. మరిన్ని రూట్లలో కొత్త బస్సులను 24 గంటల పాటు నడపాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement