Friday, November 22, 2024

ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి.. కేంద్రమంత్రులకు ఉపరాష్ట్రపతి సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమీక్షించారు. గురువారం పార్లమెంటులో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో ఉపరాష్ట్రపతి వేర్వేరుగా సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వివిధ పథకాల అమలు తీరును సమీక్షించారు. ఆయా పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పీయూష్ గోయల్ తో జరిగిన సమావేశంలో జాతీయ పారిశ్రామిక కారిడార్ పథకంలో భాగంగా చేపడుతున్న విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులతో పోటీపడేలా భారతదేశంలోనూ పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ పథకానికి కేంద్రం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. హర్దీప్ సింగ్ పురితో జరిగిన సమావేశంలో కాకినాడలో ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను పరిష్కరించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించాల్సిన వివిధ ప్రాజెక్టుల వివరాలు కనుక్కున్నారు. రాష్ట్రంలోని స్మార్ట్ సిటీల పురోగతి, అమృత్ పథకం అమలుతీరు తదితర అంశాల గురించి కూడా వెంకయ్య నాయుడు సమీక్ష జరిపారు. కిషన్ రెడ్డితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వారసత్వ నగరాల పురోగతి, వివిధ పర్యాటక సర్క్యూట్ల స్థితిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కిషన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement