Friday, November 22, 2024

తెలంగాణలో 511 మెడికల్ సీట్ల పెంపు.. ఎంపీ డా.లక్ష్మణ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 మెడికల్ కాలేజీలలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద మొత్తం 511 పీజీ మెడికల్ సీట్లను పెంచినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా.భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద 3 మెడికల్ కాలేజీలలో సూపర్ స్పెషాలటీ విభాగాలను ఏర్పాటు చేశామని, అలాగే బీబీనగర్‌లో ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

- Advertisement -

2023-24 విద్యాసంవత్సరానికి గాను 19 ప్రభుత్వ కళాశాలల్లో 3,015 ఎంబీబీఎస్ సీట్లు, 27 ప్రైవేటు కళాశాలల్లో 4,400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా 2014లో 387 మెడికల్ కాలేజీలు ఉంటే 71 శాతం పెరుగుదలతో ఇప్పుడు ఆ సంఖ్య 600కు పెరిగిందని చెప్పారు. 2014తో పోలిస్తే 51,348 ఎంబీబీఎస్ సీట్ల నుంచి 1,01,043 సీట్లకు అంటే 97% పెరిగాయని ఆమె వెల్లడించారు.

అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 52,778 సీట్లు ఉండగా, 48,265 సీట్లు ప్రైవేటు కాలేజీలలో ఉన్నాయన్నారు. 2014లో 31,185 పీజీ సీట్లు ఉండగా.. ప్రస్తుతం 110శాతం పెరిగి 65,335 పీజీ మెడికల్ సీట్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement