హిందూస్థాన్ యూనీ లివర్ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3నుంచి 5శాతం మేరకు పెంచింది. ముడి సరకు ధరలు పెరగడంతో వినియోగదారుల ప్రొడక్ట్స్ ధరలను పెంచామని పేర్కొంది. సర్ఫ్‌ఎక్సేల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్లు అదేవిధంగా లక్స్, లిరిల్, రెక్సోనా, హమామ్, డోవ్ సబ్బుల ధరలు పెరగనున్నాయి. కాగా సబ్బుల తయారీ కంపెనీలన్నీ పామాయిల్‌ను తమ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్, సోయాబీన్‌తోపాటు పామాయిల్ దిగుమతులపై ప్రభావం పడింది. పెరిగిన ధరల ప్రకారం సర్ఫెక్సల్ డిటర్జెంట్ కిలో రూ.134కు పెరిగింది. లక్స్ 100గ్రాముల నాలుగు సబ్బుల ప్యాక్ 6.66శాతం పెరిగి రూ.160కు చేరింది. పియర్స్ సబ్బులు 5.4శాతం పెరిగింది. ఇటీవల వంటపాత్రలు శుభంచేసే ధరలను పెంచిన హెచ్‌యూఎల్ అనంతరం బ్రూ కాఫీ, టీపొడి ధరలను సవరించింది.
ఈ నేపథ్యంలో వినియోగ ఉత్పత్తులను తయారుచేసే ఇతర కంపెనీలు సైతం ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మరోవైపు బ్రిటానియా సైతం ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం కారణంగా 7శాతం మేరకు ధరలను పెంచే అవకాశం ఉందని సంకేతమిచ్చింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 3శాతం ఉంటుందని అంచనా వేశామని అయితే యుద్ధ ప్రభావంతో దాదాపు 9శాతానికి చేరిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ తెలిపారు. బ్రిటానియా గుడ్‌డే, మ్యారీగోల్డ్ బిస్కెట్లను తయారు చేస్తోంది. బ్రిటానియా తరహాలో పార్లే, డాబర్ సైతం తమ ఉత్పత్తుల ధరలు పెంచనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..