హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, అర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించిన ఫీజుల పెంపు అంశంపై టీఏఎఫ్‌ఆర్‌సీ దృష్టి సారించిది. ఈమేరకు ఆయా కళాశాలలతో సంప్రదింపులు జరపనుంది. ఇందులో భాగంగానే హియరింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఫార్మసీ కళాశాల ఫీజుల పెంపుపై విచారణను ఆగస్టు 1, 2, 3 తేదీల్లో చేపట్టనుంది. ఎంబీఏ, ఎంసీఏ కళాశాల ఫీజుల పెంపుపై ఆగస్టు 10 నుండి 12 తేదీల్లో సంప్రదింపులు జరుపనుంది. అలాగే ఆర్కిటెక్చర్ కాలేజీలతో ఆగస్టు 3న సంప్రదింపులు జరపనుంది. ప్రతి మూడేళ్లకోసారి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఆర్కిటెక్చర్, లా తదితర కోర్సులకు సంబంధించిన ఫీజుల పెంపుపై టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ అడ్మిషన్స్, ఫీ రెగ్యులేటరీ కమిటీ) ఆయా కాలేజీలతో సంప్రదింపులు(హియరింగ్) జరుపుతోంది.ఇందులో కాలేజీల అభిప్రాయాలను తీసుకొని కోర్సు ఫీజును పెంచాలా? వద్దా? అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే నేటితో ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై సంప్రదింపుల ప్రక్రియ ముగియనుంది. ఇక వచ్చే నెల నుంచి ఫార్మీసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఆర్కిటెక్చర్ కోర్సుల ఫీజుల కసరత్తు ప్రారంభం కానుంది.
అయితే ఒక్కో రోజు 40 నుంచి 50కు పైగా కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ సంప్రదింపులు జరుపడంపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 10 నుంచి 12వ తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ మొత్తం 152 కాలేజీలతో ఫీజుల పెంపుపై సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఏఎఫ్‌ఆర్‌సీ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి 3వ తేదీల్లో 120 ఫార్మసీ కాలేజీలతో, ఆగస్టు 3న 9 కాలజీలను విచారించనుంది. అయితే ఒక్కో రోజు 40 కాలేజీలతో విచారణ ఎలా సాధ్యమవుతోందని టీఎస్‌టీసీఈఏ ప్రశ్నిస్తోంది. క్షణ్ణంగా తనిఖీ చేయకుండా ఆదరబాదరగా విచారణ జరిపితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతోందని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు ఏ.సంతోష్ కుమార్ విమర్శించారు. కాలేజీల్లో అధ్యాపకులు ఉన్నారో లేదో పూర్తిగా పరిశీలనా చేయాలని కోరారు.
ఎంబీఏ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తున్నారో లేదో, ఉద్యోగులకు సరిగా జీతాలు ఇస్తున్నారో లేదో విచారణ చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులకు ఆయన డిమాండ్ చేశారు. కొన్ని కాలేజీలు తనిఖీల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి అధ్యాపకులను తెచ్చి నడిపిస్తున్నట్లు ఆరోపించారు. కొన్ని ఫార్మీసీ కాలేజీలు కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలను ఇప్పటికీ చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు. నిబంధన ప్రకారం కళాశాలలు నడుచుకోవడంలేదని, ఉద్యోగులకు ఇవ్వవలసిన జీతాలు ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపైన స్పష్టంగా అధికారులు పరిశీలనా చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.