హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రత్యర్థి పార్టీల హామీలను చిత్తుచేసే విధంగా భారాస అధినేత కేసీఆర్ భారీ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను మరింత పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఎన్నికల ప్రణాళికలో చేర్చకుండా పెంచే మొత్తాన్ని వెనువెంటనే అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దివ్యాంగులకు గతంలో ఇస్తున్న పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతూ ఇటీవల మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేది న సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మొత్తాన్ని మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ప్రస్తుతమిస్తున్న రూ.2016ను రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పింఛన్‌ను పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారానికి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ ద్వారా సమాచారం తెప్పించుకున్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తున్నట్లు చెబుతున్నారు. నిరుద్యోగ భృతిని కూడా భారీగా చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యపై పూర్తి వివరాలు ఇవ్వాలని కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కోరినట్లు సమాచారం.
ప్రభుత్వం ఇప్పటికే రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇంకా ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారన్న సమాచారం వచ్చిన వెంటనే నిరుద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకొని, వెంటనే అమలులోకి తెచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. రాష్ట్రంలో 30లక్షల జనాభా ఉన్న మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధాన ప్రకటన కూడా ఈ నెలలో వచ్చే అవకాశముందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.