Thursday, November 21, 2024

Delhi | పంటలకు కనీస మద్ధతు ధర పెంపు.. పంట పెట్టుబడిపై కనీసం 50% లాభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్రం రైతులకు శుభవార్త తెలిపింది. రానున్న ఖరీఫ్ సీజన్లో సేకరించే పంటలకు కనీస మద్ధతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ ప్రారంభం కాగానే తొలుత మణిపూర్ హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారితో పాటు ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సహా మంత్రులందరూ సంతాపం తెలిపారు. అనంతరం వివిధ విధానపరమైన నిర్ణయాలకు, ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు.

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎంఎస్‌పీ ధరలు

– సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో రూ.2,040 ఉండేది. 2023-24 ఖరీఫ్ సీజన్‌ కోసం రూ.2,183కు పెంచారు. అంటే క్వింటాల్‌కు రూ.143 పెరిగింది.

– గ్రేడ్ ‘ఏ’ వరి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,060 నుంచి రూ.143 పెంచి, రూ.2,203 చేశారు.

- Advertisement -

– హైబ్రిడ్ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు.

– రాగులు (చోళ్లు) క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. అంటే రూ.268 పెరిగింది.

– వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకుముందు ఇది రూ.5,850 ఉండేది.

–  బార్లీ ధరను రూ. 100 పెంచడంతో క్వింటాల్ ధర రూ. 1,735కు పెరిగింది.

– శనగల కనీస మద్దతు ధరను రూ. 5,230 నుంచి రూ. 5,335కి పెంచారు.

– మసూర్ (మైసూరు పప్పు) పంట మద్దతు ధరను రూ. 500 పెంచడంతో క్వింటాల్ ధర రూ. 6,000కు చేరింది.

– ఆవాల కనీస మద్దతు ధరను రూ. 5,050 నుంచి రూ. 5450కు పెంచారు.

– గోధుమలకు కనీస మద్దతు ధరను రూ. 110 పెంచారు. దీంతో క్వింటాల్ ధర రూ. 2,125కు చేరింది.

– కుసుమ పంట మద్దతు ధరపై రూ. 209 పెంచారు. దీంతో క్వింటాల్ ధర రూ. 5,650కి పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధరల పట్టిక ఈ క్రింది విధంగా ఉంది….

image.png

కనీసం 50% లాభం

ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అధికంగా రైతుకు గిట్టుబాటు కలిగేలా కనీస మద్ధతు ధరను లెక్కించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సజ్జలు, కందులు, మినములు, సన్‌ఫ్లవర్‌ గింజలు, సోయాబీన్స్‌, వేరుసెనగ పంటలకు కనీస మద్ధతు ధర ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం కన్నా ఎక్కువ లాభం వచ్చేలా ధరలు నిర్ణయించినట్టు వెల్లడించింది. పెరిగిన ధరల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై సజ్జలు (85%), కందులు (60%), మినములు (59%), సన్‌ఫ్లవర్‌ గింజలు (56%), సోయాబీన్స్‌ (53%), వేరుసెనగ (51%) మేర కనీస మద్ధతు ధర నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. దేశీయ అవసరాలకు సరిపడినంత నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతులపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు వరి, గోధుమ వంటి పంటలు విషయంలో అవసరాన్ని మించి దిగుబడి వస్తోంది. అన్ని రకాల పంటలను దేశ అవసరాలకు సరిపడా దేశీయంగానే ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ మేరకు పప్పు దినుసులు, నూనె గింజల కనీస మద్దతు ధరలను పెంచడం ద్వారా రైతులను ఈ పంటల సాగు దిశగా ప్రోత్సహించవచ్చని భావిస్తోంది. దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 314.51 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనాలున్నాయి.

గురుగ్రామ్ సైబర్ సిటీకీ మెట్రో అనుసంధానం

దేశ రాజధాని న్యూఢిల్లీకి శాటిలైట్ టౌన్‌గా అభివృద్ధి చెంది ఐటీ రంగంలో దూసుకెళ్తున్న గురుగ్రామ్‌లో పట్టణ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గురుగ్రాంలోని హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీకి మెట్రో లైన్ విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 28.50 కిలోమీటర్ల మేర 27 స్టేషన్ల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది. మంజూరైన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. రూ.5,452 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

బీఎస్ఎన్ఎల్‌ను బలోపేతానికి మెగా ప్యాకేజీ 4జీ – 5జీ స్పెక్ట్రం కేటాయింపు

ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉనికి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు రూ.89,047 కోట్లతో అతిపెద్ద పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా బీఎస్ఎన్ఎల్ మూలధనం రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 2.1 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ప్యాకేజీలో భాగంగా ఈక్విటీ ఇన్‌ఫ్యూజన్ ద్వారా 4జీ, 5జీ స్పెక్ట్రం కేటాయింపులు కూడా జరిపినట్టు వెల్లడించింది. దేశంలో బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్ విస్తరణ కోసం కేంద్ర సర్కారు రంగ సంస్థ అయిన ఐటీఐకి రూ.3,889 కోట్ల విలువైన ముందుస్తు కొనుగోలు ఆర్డర్ ని అందజేసింది. ఈ చర్యల కారణంగా బీఎస్ఎన్ఎల్ నిలకడగా మెరుగైన సేవలు ముఖ్యంగా గ్రామీణ భారతంలో అందజేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement