హైదరాబాద్, ఆంధ్రప్రభ: పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లను అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పెంచిన రేట్లను కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తి ప్రకారం భరించనున్నాయి. 9, 10 తరగతుల రేట్లను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. మధ్యాహ్న భోజన పథకంలో వంట ఛార్జీలను(మెటీరియల్ కాస్ట్) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బాలవాటిక, ప్రైమరీ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.4.97 చెల్లిస్తుండగా, దానిని ఇప్పుడు రూ.5.45కి పెంచింది.
అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.7.45 బదులుగా ఇకపై రూ.8.17 ఇవ్వనున్నారు. ఈ ఛార్జీలను కోడిగుడ్డు ధరతో సంబంధం లేకుండా ఇవ్వనున్నారు. ఇక 9, 10 తరగతుల విద్యార్థులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.9.95 నుంచి రూ.10.67గా నిర్ణయించారు. అయితే 8వ తరగతి వరకు కేంద్రం మధ్యాహ్న భోజనం అమలు చేస్తుండగా వాటికయ్యే ఖర్చులో కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో ఖర్చు చేస్తుంటే.. 9, 10 తరగతుల వారికి రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చును భరిస్తున్నాయి.