స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర అంశాలపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఈ మేరకు రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుందన్న వివరాలను అధికారులను అడిగారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసనాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు. ఇప్పటివరకు అనుసరించిన రిజర్వేషన్ల విధానాలపై క్రమ పద్ధతిలో నివేదిక రూపొందించాలని అధికారులకు రేవంత్ ఆదేశించారు.
ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్ తో చర్చించాలని సూచించారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత తొందరగా నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మారోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామనిచెప్పారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర మాజీ మంత్రి జానా రెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల ప్రగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.