Tuesday, November 26, 2024

వన్యప్రాణి దాడుల నష్ట పరిహారం పెంపు! 5 నుంచి 10 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వన్యప్రాణుల (పులులతో సహా) దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని వన్యప్రాణి మండలి (వైల్డ్‌ లైఫ్‌ బోర్డు) నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పరిహారం అధ్యయనం చేసిన తర్వాత బోర్డు ఈ కొత్త ప్రతిపాదనలపై చర్చించింది. అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధ్యక్షతన అరణ్యభవన్‌లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సోమవారం మనుషులు-జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు(కవ్వాల్‌లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని మంత్రికి అధికారులు వివరించారు. మనషులు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణం నిరోధించేందుకు అవసరమైన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్ష రూపాయలకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయాల పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, 50వేల రూపాయాలకు మించకుండా ప్రతిపాదనలను కమిటీ రూపొందించింది. అలాగే పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు పెంచాలని, పండ్లతోటలకు నష్టపరిహారం కూడా రూ.7500లకు (గరిష్టంగా రూ.50వేల దాకా) కమిటీ ప్రతిపాధించింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం తెలిపిన తర్వాత అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్‌ వనస్థలిపురంలో బస్‌టెర్మినల్‌ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. హరిణ వనస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతినిచ్చారు.

జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్‌ నిర్మాణం కానుంది. అయితే హరిణ వనస్థలి కోసం అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్‌లో ఉన్న వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బోర్డు తిరస్కరించింది. అయితే ఇతర రోడ్డు, ఇరిగేషన్‌, కేబుల్‌ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణుల ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూటీమ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు కోవ లక్ష్మీ, రాఘవ, బానోతు రవికుమార్‌, అనిల్‌ కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement