న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ కులాన్ని జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్‌ను బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్, తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు గురువారం ఢిల్లీలో కలిశారు. అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం వల్ల అనేక అవకాశాలను కోల్పోతున్నామని తెలిపారు. అందుకే తాము నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) ఛైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి తనకు గతంలోనూ చాలా విజ్ఞప్తులు వచ్చాయని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిషన్ ఛైర్మన్ హామీ ఇచ్చినట్టు బీబీ పాటిల్ వెల్లడించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న తమను జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం వల్ల విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఓబీసీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి ఇప్పటి వరకు ఓబీసీ జాబితాలో చేర్చాలని మూడు సార్లు సిఫారసు చేసిందని, దీనిపై జాతీయ బీసీ కమిషన్ 2021 డిసెంబర్ 22న విచారణ చేపట్టిన సమయంలో తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి నివేదికను కూడా అందజేశామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ బీసీ కమిషన్ విజ్ఞప్తిపై జాతీయ కమిషన్ ఛైర్మన్ సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని హామీ ఇచ్చారని శుభప్రద్ పటేల్ తెలిపారు.