Tuesday, November 19, 2024

Delhi | శ్రీముఖ లింగేశ్వరాలయాన్ని యునెస్కో జాబితాలో చేర్చండి.. కేంద్ర పురావస్తు శాఖకు ప్రధాన అర్చకుడి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీముఖ లింగేశ్వర ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని ఆలయ ప్రధాన అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ కేకే బాషాను కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. శ్రీముఖ లింగేశ్వర క్షేత్రం విశిష్టతపై యునెస్కోకు ప్రతిపాదన పంపాలని కోరారు. ఆలయం దశాబ్దాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

స్వామి వారి శిల్పాలు, విగ్రహాలు భద్రపరిచే మ్యూజియం 2005లో ఏర్పాటైనా ఇంతవరకు పది శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఆయన వాపోయారు. కనీసం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రహరీ గోడ కూడా నిర్మించలేదని డైరెక్టర్ జనరల్‌కు వివరించారు. ఆలయ పరిసరాలు పారిశుద్ధ్యం లోపం వల్ల భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి వీలైనంత త్వరగా ఆలయ పనులు పూర్తి చేయాలని డైరెక్టర్ జనరల్ ఆదేశించారని రాజేశేఖర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement