Saturday, November 23, 2024

ప్రసాద్ పథకంలో మరిన్ని ఆలయాలు చేర్చండి.. కిషన్ రెడ్డికి సత్యనారాయణ విజ్ఞప్తి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పుణ్యక్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం పథకం ‘ప్రసాద్’లో చేర్చాలని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, గురువారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిశారు. ఇప్పటికే ప్రసాద్ పథకంలో సింహాచలం, అన్నవరం దేవస్థానాలను చేర్చి నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు చెబుతూ, రాష్ట్రంలోని మరికొన్ని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు. వాటిలో ద్వారకా తిరుమల, బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలు ఆలయాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. మొత్తంగా రూ. 380 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందజేసినట్టు తెలిపారు. కిషన్ రెడ్డితో భేటీ అనంతరం సాయంత్రం గం. 5.30కు ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ద్రాక్షారామం భీమలింగేశ్వర ఆలయం గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించానని అన్నారు. పురాతనమైన ఈ ఆలయానికి చారిత్రికంగా ఎంతో ప్రాశస్త్యం ఉందని వెల్లడించారు. అక్కడ సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి నిధులు కేటాయించాలని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తంలో నిధులను వెచ్చించగల్గితే, కేంద్రం నుంచి కూడా నిధులు అందించే ఏర్పాటు చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ మేరకు వెంటనే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులను పిలిపించి, ఓసారి ప్రత్యక్షంగా ద్రాక్షారామం సందర్శించి రావాల్సిందిగా కిషన్ రెడ్డి సూచించారు. ప్రసాద్ పథకంలో చేర్చే ఆలయాల జాబితాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల విషయంలో కేంద్ర మంత్రి సానుకూల వ్యక్తం చేసినట్టు కొట్టు సత్యనారాయణ తెలిపారు.

అవగాహన లేమితో ఆరోపణలు.. టీటీడీ నిధుల వివాదంపై వివరణ..

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డిపాజిట్లపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతల ఆరోపణలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఏమాత్రం అవగాహన లేకపోవడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన కొట్టిపడేశారు. చట్ట ప్రకారం ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ (ఈఏఎఫ్) కింద 8 శాతం, సీజీఎఫ్ కింద 9 శాతం చట్ట ప్రకారమే తీసుకోవచ్చని తెలిపారు. అలాగే 3 శాతం అర్చకుల సంక్షేమం కోసం, 1.5 శాతం ఆడిట్ ఫీజు రూపేణా తీసుకుంటామని తెలిపారు. అయితే కొన్ని ఆలయాల్లో ఈ మొత్తాన్ని రెమిట్ చేయకుండా డిపాజిట్ చేశారని, అలా డిపాజిట్ చేసిన సొమ్ము నుంచి చట్టబద్ధంగా రావాల్సిన వాటా సొమ్మును మాత్రమే డ్రా చేయాల్సిందిగా సూచించామని చెప్పారు. ప్రతియేటా ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే రూ. 40 కోట్ల మేర సీజీఎఫ్ వాటా వస్తుందని తెలిపారు. ఇదేదీ తెలీకుండా హిందూ ఆలయాల సొమ్ము కాజేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement