సికింద్రాబాద్, ప్రభన్యూస్: ఎవరూ ఊహించని విధంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన బన్సీలాల్‌పేటలోని మెట్లబావిని ఈనెల 5న మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మంత్రి బన్సీలాల్‌పేటలోని మెట్లబావి, పరిసరాల్లో మున్సిపల్ ప్రిన్స్‌పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్‌తో కలిసి పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. మెట్లబావి, నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్లబావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్‌ను పరిశీలించారు.
ప్రారంభోత్సవం రోజు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పురాతన కట్టడాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అందులో భాగంగానే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో బన్సీలాల్‌పేట మెట్లబావి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ బావిని నిజాంకాలంలో అప్పటి స్థానిక ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించినట్లు చెప్పారు. అప్పట్లో ఈ బావిని నాగన్న కుంటగా పిలిచే వారని ఇక్కడ ఉన్న ఆధారాల ద్వారా తెలుస్తుందని వివరించారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి ముందు ఈ బావి పూర్తిగా చెత్త, చెదారాలతో నిండిపోయిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పూడిక తొలగింపు చేయగా 500 టన్నులకు పైగా ఉన్నదని, దీన్ని తరలించడానికి 6నెలల సమయం పట్టిందని చెప్పారు.
పూడిక తొలగించిన తర్వాత నీటితో కలకళలాడుతుందని చెప్పారు. బావి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో పూర్వ వైభవం వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో బావి పరిసరాల్లో అనేక అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. నగరంలో 44బావులు ఉండగా 6బావుల అభివృద్ధి, పరిరక్షణ పనులు చేపట్టినట్లు చెప్పారు. వాటిలో ముందుగా పనులు పూర్తి చేసుకొని బన్సీలాల్‌పేట మెట్లబావి ప్రారంభానికి సిద్ధమైంది. ఈకార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సాహె స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు కల్పన, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు ఉన్నారు.