కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం జలంధర్‌లోని బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో హాకీ కోసం అత్యాధునిక ఆస్ట్రో టర్ఫ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్‌లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ నిబద్ధతను ఠాకూర్ నొక్కిచెప్పారు. ”క్రీడలు సమగ్ర అభివృద్ధికి ఉత్ప్రేరకం. ప్రతిభావంతులైన అథ్లెట్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అవకాశాలను అందించడానికి భారత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ ఆస్ట్రో టర్ఫ్ ప్రారంభోత్సవం క్రీడలను ప్రోత్సహించడానికి, క్రీడా సంఘం సామర్థ్యాన్ని పెంపొందించడానికి మా అంకితభావాన్ని సూచిస్తుంది” అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించిన స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా హాకీ ఇండియా నుండి అవసరమైన అన్ని అనుమతులు పొందిందని మంత్రి చెప్పారు. పంజాబ్ రాష్ట్రాన్ని అథ్లెట్లను ఉత్పత్తిచేసే గొప్ప ప్రాంతంగా అభివర్ణించారు. భారతదేశ క్రీడా వారసత్వానికి ఈ రాష్ట్రం ఎంతో సహకరించిందని తెలిపారు. క్రీడాభివృద్ధిలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సహకారాన్ని ప్రస్తావించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ అత్యాధునిక ఆస్ట్రో టర్ఫ్ సౌకర్యం ఈ ప్రాంతంలోని ఔత్సాహక క్రీడాకారులకు కేంద్రంగా నిలుస్తుందని, సుమారు రూ.6 కోట్ల వ్యయంతో దీన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.