బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మకు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఇవ్వాల (శనివారం) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషిచేసిన మహిళ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ కోసం 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమించిన ధీరవనిత అని కొనియాడారు. అలాంటి ఆడపడుచును కించపరిచే విధంగా ‘‘ఈడీ అరెస్టు చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా‘‘ అని పరుష పదజాలంతో బండి సంజయ్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న ఉద్యమాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని విమర్శించారు. సంజయ్ మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ మహిళలు, ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా రోడ్డెక్కి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
ఓ మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా పరుష పదజాలంతో దూషించిన బండి సంజయ్ పై చర్యలు తీసుకుని మహిళల హక్కులను కాపాడే విధంగా.. అలాగే మరొకరు ఈ విధంగా మహిళలను అగౌరవ పరిచేవిధంగా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్‌ను కోరినట్లు రాజీవ్ సాగర్ తెలిపారు.