Sunday, September 8, 2024

Big Story | రెండోవారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. 15, 16 తేదీల్లో విడుదలయ్యే చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లి ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును బీజేపీ ముమ్మరం చేసింది. ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. తొలి విడతలో 30 నుంచి 40 స్థానాలకు అభ్యర్థులతో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

స్క్రీనింగ్‌ కమిటీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అభ్యర్థుల తొలి జాబితాపై రాజగోపాల్‌రెడ్డి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో బలమైన అభ్యర్థులకే చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మూడు విడతల్లో 119 అసెంబ్లి స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని బీజేపీ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.

ఒకే నేత పోటీలో ఉన్న స్థానాలకు తొలి విడత జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 40 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ను రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసి అధిష్టానం ఆమోదం కోసం ఢిల్లి పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈసమావేశంలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి విడత జాబితాకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

కేంద్ర ఎన్నికల కవమిటీ ఆమోదం రాగానే వెంటనే తొలి విడత జాబితా విడుదలవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బలమైన అభ్యర్థులనే ఈసారి అసెంబ్లి ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ పె ద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. సర్వేలు, ముఖ్యనేతల అభిప్రాయాలు, ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన పొరుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల నివేదికలు, అభ్యర్థి బలా బలాలు, ప్రజల్లో పేరు తదితర అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

ఆయా నియోజకవర్గంలో పార్టీ బలంతోపాటు అభ్యర్థుల బలాబలాలపై పోర్టీ కేంద్ర బృందాలు, రాష్ట్ర పార్టీ రంగంలోకి దింపిన బృందాలు సర్వేలు నిర్వహించాయి. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల బలాబలాల ఆధారంగానే రెండో,మూడో విడత జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత జాబితా పూర్తయిన అనంతరం తెలంగాణలో ఇప్పటికే ప్రధాని మోడీ మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ పర్యటనల్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

పార్టీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణలో విస్తృతంగా పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ప్రధాని పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నిండడంతో అదే ఊపులో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు తొలి విడతలో అభ్యర్థుల ను ప్రకటించి పూర్తి స్థాయి అసెంబ్లి ఎన్నికల యుద్ధంలో దిగేందుకు బీజేపీ సిద్ధమైంది. అభ్యర్థుల జాబితాను విడుదల చేసి కార్యకర్తల్లో మరింత జోష్‌ను నింపాలని భావిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌ అసెంబ్లి ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఆ పార్టీలోని అసంతృప్తులకు కూడా గాలం వేయాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్‌లో ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురేసి అభ్యర్థుల పోటీ పడుతుండడం, అందులో ఒకరికే టికెట్‌ రానుండడంతో మిగిలిన ఇద్దరు అసంతృప్త నేతలకు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ స్కెచ్‌ గీసింది.

అదే సమయంలో బీఆర్‌ఎస్‌లోని మరికొంత మంది అసంతృప్త నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చెబుతోంది. వారిని కూడా చేర్చుకుని మూడు విడతల్లో 119 అసెంబ్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితాను వడపోయడంతోపాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలతో రెండు, మూడు జాబితాలను బీజేపీ విడుదల చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement