న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పెంచిన ధరలు, జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా వరుసగా నాలుగో రోజు టీఆర్ఎన్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంటు ఉభయ సభల్లో, సభ వెలుపల విపక్షాలతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు , లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభ ప్రారంభమవడానికి ముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ఎదుట ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపు, ద్రవ్యల్బణం తదితర అంశాలపై ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పార్లమెటు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే, ఈ అంశాలపై చర్చకు పట్టుబడుతూ ఆందోళన చేపట్టారు.
ఈ మేరకు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను ఆమోదించి తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి చర్చ చేపట్టాలని నామ నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ప్రజలపై భారం తగ్గించే వరకు టీఆర్ఎస్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలో కేకే, నామతో పాటు ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.