Friday, November 22, 2024

ఉప ఎన్నికల్లో బీజేపీ హవా.. ఏడు స్థానాలకు నాలుగుచోట్ల గెలుపు

దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఆధిక్యాన్ని చాటుకుంది. నాలుగుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు సిట్టింగ్‌ స్థానాలతోపాటు హర్యానాలోని కాంగ్రెస్‌ సీటును కమలనాథులు సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మునుగోడు లో అధికార తెరాస అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బీజేపీలో చేరడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. తద్వారా రెండు సిట్టింగ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఇక మహాష్ట్రలోని అంధేరి ఈస్ట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన (ఉద్ధవ్‌) అభ్యర్థి రితుజా లక్డే ఘన విజయం సాధించారు. పోటీ నుంచి బీజేపీ వైదొలగడంతో ఆమెకు భారీ మెజార్టీ లభించింది.

ఇక్కడ నోటా రెండవ స్థానంలో నిలిచింది. సంకీర్ణంలో భాగంగా కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు లక్డేకు మద్దతుగా నిలిచాయి. రుతుజాకు మొత్తం 66,247 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 12,776 ఓట్లతో నోటా రెండో స్థానంలో నిలిచింది. రుతుజా లట్కే భర్త రమేశ్‌ లట్కే మరణంతో అంధేరి ఈస్ట్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీహార్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగగా, బీజేపీ, ఆర్జేడీ తమ తమ సిట్టింగ్‌ సీట్లను తిరిగి దక్కించుకున్నాయి. గోపాల్‌గంజ్‌లో ఆర్జేడీ కేవలం 2000 ఓట్లతో ఓటమిపాలైంది. ఇక్కడ ఏఐఎంఐఎం (12000), బీఎస్‌పీ (6000) లు పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చింది. గోపాల్‌గంజ్‌ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. యూపీలోని గోలగోక్రన్నాథ్‌, ఒడిశాలోని ధామ్‌నగర్‌ సిట్టింగ్‌ స్థానాలను బీజేపీ నిలుపుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement