లోన్ రికవరీ అధికారులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. ఓ నిండు గర్భిణీని ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. ఈ దారుణం జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో వెలుగుచూసింది. హజారీబాగ్‌కు చెందిన ఒక రైతు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొన్నాడు. అయితే ఆ సంస్థ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ట్రాక్టర్ స్వాధీనం కోసం శుక్రవారం ఆ రైతు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్ద రైతు కుమార్తె ఉంది. గర్భిణీ అయిన ఆమెకు ఫైనాన్స్ సంస్థ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ట్రాక్టర్ స్వాధీనానికి అధికారులు ప్రయత్నించగా ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫైనాన్స్ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌తో గర్భిణీని ఢీకొట్టి ఆమె మీదుగా నడిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గర్భిణీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైనాన్స్ సంస్థ అధికారులపై హత్య కేసు నమోదు చేశారు. నిందితులపై తగిన చర్య తీసుకుంటామని హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ తెలిపారు.