కోసిగి, ప్రభ న్యూస్: నల్లరేగడి పండ్లు తిని ఓ మహిళ ముగ్గురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా అందులో హర్ష (2) అనే బాలుడు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి గ్రామం 3వ వార్డులో శనివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పొలం నుండి తెచ్చిన నల్లరేగడి పండ్లు బాకీటు లో ఉండగా మహాదేవి అనే మహిళ తినడంతోపాటు తన కుమారులు అంజి, హర్షకులకు తినిపించింది. అలాగే, పక్కింటి వీరారెడ్డి, లక్మి దంపతుల కుమారుడు శ్రీరాములుకు సైతం పండ్లు ఇచ్చింది. తిన్న వెంటనే నలుగురూ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మొదట కోసిగిలో ఒక ప్రేవేట్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి బంధువులు తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం ఆదోని ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో మహాదేవి కుమారుడు హర్ష మృతి చెందాడు. అదోనిలోని ప్రైవేట్ ఆసుప్రతిలో మిగిలిన వారికి చికిత్స చేయిస్తున్నారు. కళ్ల ముందే గిలగిలకొట్టుకుంటూ బాలుడు హర్ష మృతి చెందడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. కోసిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని హర్ష మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అదోనికి తరలించారు. తండ్రి ఈరన్న ఉదయమే కూలిపనుల నిమిత్తం కర్ణాటక రాష్టం రాయచూర్‌కు వెళ్లడంతో జరిగిన సంఘటన సమాచారాన్ని తెలియ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.