Friday, November 22, 2024

ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు : మంత్రి పువ్వాడ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్‌లో ఉన్న వారంతా కేసీఆర్‌కు విధేయులే అని, నా బ్రాండ్ నా గ్రూప్ అంటే కుద‌ర‌దు అని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్.. పొంగులేటి లాంటి వ్య‌క్తుల‌ను రాష్ట్రంలో ఎంతో మందిని చూశారు. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్షాన్ని 2009లో చీల్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడే కేసీఆర్ చ‌లించ‌లేదు అని గుర్తు చేశారు మంత్రి పువ్వాడ‌. ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పువ్వాడ పాల్గొని ప్ర‌సంగించారు. ద‌మ్ముంటే త‌న‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌న్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మంత్రి పువ్వాడ స్పందించారు. ద‌మ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి అని పువ్వాడ అజ‌య్ స‌వాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ద్వారా గెలిచి పొంగులేటికి వంత పాడుతున్న నేత‌లంతా త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి అని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ నీడ నుంచి వెళ్లిన వారికి రాజకీయ జీవితం లేకుండా పోయింది. కేసీఆర్ త‌యారు చేసిన నాయ‌కులు చాలా పెద్ద‌వాళ్లం అనుకుంటున్నారు. ఒక్కసారి కేసీఆర్ చేయి వ‌దిలేస్తే వారి గ‌తి అధోగ‌తే అని హెచ్చ‌రించారు. ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేద‌ని మంత్రి అన్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్ ఏ ఒక్క రోజు కూడా త‌న స్వార్థం కోసం రాజ‌కీయాలు చేయ‌లేదు. వైరా నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ అభ్య‌ర్థిని గెలిపించే బాధ్య‌త తానే తీసుకుంటున్నాన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement