హైదరాబాద్, ఆంధ్రప్రభ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందరికీ మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ వేగంగా పయనిస్తోంది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది. అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3 వ స్థానానికి చేరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014తో పోల్చితే సాధించిన ప్రగతి స్పష్టమవుతోంది. వివిధ ఆరోగ్య సంరక్షణ అంశాల్లో 2014నాటి సూచీలను పోల్చి చూడగా… లక్ష ప్రసవాలకు 2014లో 92గా ఉన్న మాతృ మరణాలు.. 2022 నాటికి 56కు తగ్గాయి. 2014లో 39గా ఉన్న శిశు మరణాలు… 2022 నాటికి 23 కు తగ్గాయి. 2014లో 5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లల మరణాలు 41గా ఉంటే 2022 నాటికి ఆ సంఖ్య 30కి పడిపోయింది. అదే సమయంలో 25గా ఉన్న బాలింత మరణాలు 16కు తగ్గాయి. ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్ విషయానికి వస్తే 2014లో 68శాతం ఉంటే… 2022 నాటికి 100శాతానికి చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 2014లో 30 శాతంగా ఉంటే 2022 నాటికి 56శాతానికి పెరిగింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య 98శాతానికి పెరిగింది.
తలసరి వైద్యంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల్లో రూ.1698 వ్యయంతో హిమాచల్ ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 2022-23 బడ్జెట్‌లో ఈ వ్యయాన్ని రూ.3091కి తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్ ఫిట్‌నెస్ కాంపెయిన్‌లో 3 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణ రాష్ట్రం 3 అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలోనూ, నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌లో 2వ స్థానంలో నిలిచింది. వైద్య సదుపాయాల విస్తరణ, నిరంతర పర్యవేక్షణతోపాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మీ , అమ్మవడి పథకాల సమ్మిళిత ఫలితాలే జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన ఆరోగ్య సూచికలు అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విస్తరించిన సదుపాయాలు, ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సేవలను పరిశీలిస్తే వైద్య రంగం సాధించిన పురోగతి ఇట్టే కళ్లకు కడుతోంది. ఈ ఏడేళ్ల కాలంలో ప్రత్యేకించి హెల్త్ హబ్‌గా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దేశ విదేశీ ప్రజలు వై ద్య సేవల కోసం హైదరాబాద్‌కు వస్తుండడంతో హెల్త్ టూరిజం బాగా విస్తరించింది.
సీఎం కేసీఆర్ ఆకాంక్షలకనుగుణంగా వైద్య సదుపాయాల కల్పన..
తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా నిరుపేదలకు కూడా కార్పోరేట్‌స్థాయి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాథమిక స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతులు కల్పించింది. గతంలో మూడు అంచెలు, ప్రాథమిక సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ద్వితీయస్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషాలిటీ సేవలకు మెడికల్ కాలేజీలుగా ఉన్న వైద్య సేవలు వ్యవస్థకు అదనంగా ప్రివెంటివ్ సేవలకు బస్తీ/పల్లె దవాఖానాలను, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు టిమ్స్ లతో 5 అంచెలు వ్యవస్థగా మార్చి ప్రజల ముగింటకే ప్రాథమిక వైద్యాన్ని, పేదలకు అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.
అయిదంచెల వైద్య వ్యవస్థ…
గతంలో క్షేత్రస్థాయిలో వ్యాధులను గుర్తించే ప్రివెంటివ్ సేవలు అందించే వ్యవస్థ లేదు. అలాగే అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే టిమ్స్ లాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. 5 అంచెల వ్యవస్థతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరికరాలతోపాటు ఐసీయూ బెడ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే వైద్య బోధన కళాశాలల్లో ఐసీయూ బెడ్స్ ను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగ నిర్ధారణా పరీక్షా కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం, వాటి నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నస్టిక్ లేబరోటరీని ఏర్పాటు చేశారు. మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో జరుగుతున్న రోగ నిర్ధారణా పరీక్షలను మానిటరింగ్ చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్థుల సౌలభ్యం కొరకు 42 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది. ఈ కేంద్రాల సంఖ్యను 102కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. డయాలసిస్ కేంద్రాలకు రోగులు వచ్చిపోయేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌లలో క్యాథ్‌ల్యాబ్‌లను ప్రభుత్వం నెలకొల్పింది.
మెరుగైన పారిశుధ్యం కోసం శానిటేషన్ ఛార్జీలు పెంపు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రతి బెడ్‌కు చేస్తున్న ఖర్చును రూ.5వేల నుంచి రూ.7500కు పెంచడం జరిగింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను రోజుకు రూ.40 నుంచి రూ.80కి పెంచారు. ప్ర భుత్వ వైద్య సేవలపై ప్రజల నమ్మకం, విశ్వాసం నానాటికి పెరుగుతోంది. ప్రభుత్వ వైద్య సేవలను పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా రోజుకు 25000-30000కు పెరిగింది. అందత్వరహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం కింద 1కోటి 52 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 41 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను అందించారు. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి.
వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత..
రాష్ట్ర ప్రజల వైద్య అవసరాలను నెరవేర్చే సంకల్పంతో వైద్య విద్య విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా వరంగల్‌లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి తెలంగాణలో ప్రభుత్వపరంగా 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. మొదటి దశలో ఒక్కొక్కటి రూ.450 కోట్ల వ్యయంతో కొత్తగా మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు నడుస్తున్నాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 2021లో 8 కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కోదానికి రూ.510 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూలు, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో మెడికల్ కాలేజీల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నారు. 2022-23 నుంచే ఈ 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. 2023-24లో మరో 8 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న 700 ఎంబీబీఎస్ సీట్లు 2021 నాటికి 1649 సీట్లకు పెరిగాయి. 2014లో 531 ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు 2021 నాటికి 967 కు పెరిగాయి. 2014లో 82 ఉన్న సూపర్ స్పెషాలిటీ సీట్లు 2021నాటికి 153కు పెరిగాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు అయిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు 5240కు, పీజీ మెడికల్ సీట్లు 2500కు, సూపర్ స్పెషాలిటీ సీట్లు 1000కు పెరగనున్నాయి.
వరంగల్‌లో హెల్త్ సిటీ… హైదరాబాద్ నాలుగు దిక్కులా కొత్త టిమ్స్ లు
ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా ఉన్న వరంగల్‌ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేసేందుకు 2000 పడకల సామర్థ్యంతో రూ.1100కోట్లతో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్‌అంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడీయాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి 35 రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాలతో మల్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాన్సర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులతోపాటు ఆధునిక వైద్య సేవల కొరకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చే వారికి అందుబాటులో ఉండేవిధంగా ఎయిమ్స్ తరహాలో నగరానికి నాలుగు వైపులా తెలంగాణ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్ ) పేరున సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా 1500 పడకలతో గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మొత్తం రూ.2679 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 1000 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో అల్వాల్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. వీటిలో 300 ఐసీయూ పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టిమ్స్ ఆసుపత్రిలో 26 రకాల ఆపరేషన్ థియేటర్లు, 30 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల విభాగాలు, 16 స్పెషాలిటీ , 15 సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ కోర్సులు, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. నిమ్స్ ను విస్తరించేందుకు ఇతర టీచింగ్ ఆసుపత్రుల సీట్లలోసీట్ల పెంపుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
బస్తీ దవాఖానాలతో పట్టణ పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం..
పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఆదేశాలతో 141 మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపీడీని అరికట్టేందుకు 57 రకాల రోగనిర్ధారణా పరీక్షలను ఉచితంగా చేసేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ల్యాబ్‌లను ప్రభుత్వం నెలకొల్పి, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేసపింది. ప్రాథమిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 4745 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.
మృతదేహాల తరలింపుకు ప్రత్యేక పార్థీవ వాహనాలు..
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో అత్యధికులు పేదలే. చికిత్సకొరకు వచ్చిన పేద రోగులు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ పార్తీవదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు పడే కష్టాలు వింటే బాధకలుగుతుంది. చనిపోయిన వ్యక్తి భౌతికకాయాన్ని గౌరవప్రదంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశ్యంతో పార్థీవ వాహన సేవలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. దేశంలో మొదటిసారి ఇలాంటి సేవలను ప్రవేశపెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా 50 వాహనాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని 18 ప్రధాన ఆసుపత్రులకు వైద్య సేవలు పొందుతున్న రోగులతోపాటు వచ్చే సహాయకులకు రూ.5కే మూడు పూటలా భోజన సదుపాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకం కింద ప్రతి రోజూ సుమారు 18, 600 మంది రోగి సహాయకులు లబ్దిపొందుతున్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ముందుచూపుతో అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తోంది. అదే స్ఫూర్తితో ఆరోగ్య కుటుంబ సంక్షేమ పథకాల అమలులో ముందున్న రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ రూపుదిద్దుకుంటోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.