- బెంగళూర్‌ను దాటేసిన మహా నగరం
- సిటీలో పెరుగుతున్న క్యాష్‌లెస్ సేవలు
- బడ్డీ కొట్టు నుంచి మాల్స్ వరకు
- ఆన్‌లైన్ నగదు చెల్లింపులు
- ఈజ్ ఆఫ్ ఇండెక్స్ సర్వేలో వెల్లడి
డిజిటల్ సేవల రంగంలో ఇప్పటి వరకు రెండవస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం బెంగళూరును వెనక్కి నెట్టేసి మొదటి స్థానానికి చేరుకుంది.. బడ్డీ కొట్టు నుంచి మాల్స్ వరకు అంతటా క్యాష్‌లెస్ సేవలు విస్తృతంగా వృద్ధిచెందుతున్నాయి. యూపీఐ.. ఫోన్‌పే.. గూగుల్‌పే తదితర మాధ్యమాల ద్వారా నగర ప్రజలు తమ వ్యక్తిగత.. వ్యాపార.. వాణిజ్య లావాదేవీలను నిర్వహిస్తున్నారు.. ఓలా మొబిలిటీ ఇనిస్టి ట్యూట్ ఫౌండేషన్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం హైదరాబాద్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : దేశంలో డిజిటల్ సేవలను అన్నిరంగాలకు విస్తరించాలనే కేంద్ర ప్రభుత్వ కాంక్షకు అనుగుణంగా హైదరాబాద్ నగరం నగదు రహిత లావాదేవీల్లో దూసుకుపోతోంది. కూరగాయలు, పాలు మొదలుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్నింటా క్యాష్‌లెస్ సేవలు అందుబాటులో ఉండటంతో ప్రజలు వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. గతంలో లాగా నగదు చెల్లింపులకన్నా ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌వైపే న గర ప్రజలు మొగ్గుచూపుతున్నారు. జేబులో చిల్లిగవ్వ లేకున్నా నగదు రహిత లావాదేవీల ద్వారా అన్నింటిని ఖరీదు చేసే పరిస్థి తి అందుబాటులో ఉండటంతో నగదు రహిత కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. డిజిటల్ సేవల వల్ల డబ్బుకు సెక్యూరిటీ కూడా ఉండటంతో ప్రజలు తమ నిత్య జీవితంలో వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. భవిష్యత్ ఈ సేవల రంగం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
బెంగళూర్‌ను వెనక్కి నెట్టేసిన నగరం
నగదు రహిత వివిధ ఆర్థిక లావాదేవీల్లో బెంగళూర్‌ను వెనక్కినెట్టి హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంది. గడిచిన జనవరి నుంచి డిసెంబర్ వరకు 2022 ఏడాదిలో డిజిటల్ సేవలరంగంలో నగరం గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్యాసింజర్ మొబిలిటీ కోసం స్మార్ట్‌ఫోన్ అప్లి కేషన్లు, పార్కింగ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల క్రమబద్ధీకరణ కోసం యాప్‌ల వినియోగం, నగదు రహిత సేవల కోసం ఫిన్‌టెక్ సొల్యూషన్స్, సేవలను కొనుగోలు చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు మొదలైన డిజిటల్ సాధనాలను అందిపుచ్చుకోవడంతో దేశంలోనే హైదరాబాద్ నెంబర్‌వన్‌గా నిలిచిందని ఓలా మొబిలిటీ ఇనిస్టి ట్యూట్ ఫౌండేషన్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ 2022 నివేదిక వెల్లడించింది . గడిచిన ఏడాదికంటే వేగంగా ఈ రంగంలో నగరం తన వృద్ధిని నమోదు చేసుకుంటోందని తెలిపింది.