Tuesday, November 26, 2024

వెంటాడుతున్న రక్తహీనత..!

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులు సంకల్పించడం మంచిదే. దీనికి జిల్లా సంక్షేమ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో కృషి చేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. దీనికి ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐఎఫ్‌పీఆర్‌ఐ), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులే షన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌), యూనిసెఫ్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ (ఐఈజీ)లతో కలిసి నీతి ఆయోగ్‌ ది స్టేట్‌ న్యూట్రిషన్‌ ప్రొఫైల్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దేశంలో పోషకాహార పురోగతిపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఫేజ్‌-1) అనే వెబ్‌నార్‌లో ఆయా రాష్ట్రాల పోషకాహార ప్రొఫైల్‌ను విడుదల చేశారు.

ఇందులో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహారలోపం కారణంగా వయస్సుకు తగ్గట్లుగా ఎత్తు పెరకపోవడం అనే సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. దీని ప్రకారం హైదరాబాద్‌ జిల్లాలో దాదాపు 1.02,126 మంది చిన్నారుల్లో పోషకలోపం ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లాలో 1.91,931 మంది చిన్నారులు, మహిళల్లో 6,37,565 మందిలో రక్తహీనత ఉన్నట్లు తేల్చారు. అయినా కూడా ఇటీవల జరిగిన పోషణ అభియాన్‌, పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలోనే జిల్లాలో రక్తహీనత శాతం అధికంగా ఉందని.. సంబంధిత శాఖల అధికారులు చెప్పడాన్ని ఎలా..? అర్థం చేసుకోవాలో తెలియాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్‌ను గత 2018, మార్చి 8న రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. యుక్త వయస్సులో ఉన్న బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 0-6 ఏళ్ల చిన్నారుల పోషకాహార స్థితిపై జిల్లా సంక్షేమ, వైద్యారోగ్యశాఖ అధికారులు దృష్టిపెట్టక పోవడం గమనార్హం. మరోవైపు అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, చిన్నారులకు ఇచ్చే సరుకులు ఇటీవల కాలంలో ఆయాలు, టీచర్ల ఇళ్లలో దర్శనమిస్తుండటంపై అధికారుల తీసుకుంటున్న చర్యలు ఇట్టే అర్థం అవుతున్నాయి. ఇప్పటికైన జిల్లా అధికారులు పోషణ అభియాన్‌లో భాగంగా ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేసి.. జిల్లాలో పోషకాహార లోపం లేకుండా చేస్తారని.. ఆశిద్ధాం..!

Advertisement

తాజా వార్తలు

Advertisement