కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది. దీంతో ప్రస్తుతం టీవీలకు వాడుతున్న సెట్‌టాప్ బాక్స్‌ల పని ఖతం అయిపోయినట్టే అని తెలుస్తోంది. ఎందుకంటే టీవీలలోనే ఇన్ బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్ (built-in satellite tuner) ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో సెట్ టాప్ బాక్స్‌ల శకం కూడా ముగిసిపోయేలా ఉంది.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో టెలివిజన్ (టీవీ) తీరులో ఎంతో మార్పు వస్తోంది. దూరదర్శన్ యాంటెనా స్థాయి నుంచి కెబుల్, సెటాప్ బాక్సుల దాకా ఇప్పుడు విస్తరించింది. అయితే.. ప్రస్తుతం నడుస్తున్న సెట్ టాప్ బాక్స్‌ల యుగం కూడా కనుమరుగు కాబోతున్నట్టు టెక్నాలజీ విస్తరణ చూస్తుంటే తెలుస్తోంది. టెలివిజన్ సెట్‌లలో 200కి పైగా చానళ్లను యాక్సెస్ చేయడానికి అంతర్నిర్మిత శాటిలైట్ ట్యూనర్‌ను (built-in satellite tuner) ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని ద్వారా వీక్షకులు సెట్-టాప్ బాక్స్ లేకుండా టీవీ ప్రోగ్రామ్‌లను చూడొచ్చు.
అంతర్నిర్మిత ఉపగ్రహ ట్యూనర్‌లతో కూడిన టెలివిజన్ సెట్‌లు బిల్డింగ్ పైకప్పునకు లేదా ఇంటి గోడకు.. ఆరుబయట చిన్న యాంటెనాని అమర్చడం ద్వారా ఫ్రీ-టు-ఎయిర్ టెలివిజన్, రేడియో చానెల్‌ల ను వినడం, చూడడం చేయొచ్చు. దూరదర్శన్ అనలాగ్ ట్రాన్స్‌మిషన్‌ను దశలవారీగా నిలిపివేసే ప్రక్రియలో ఉండడంతో డిజిటల్ శాటిలైట్ ట్రాన్స్‌మిషన్‌ని ఉపయోగించి ఫ్రీ-టు-ఎయిర్ చానెల్‌లు ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది.
బిల్ట్-ఇన్ శాటిలైట్ ట్యూనర్‌ల కోసం బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ జారీ చేసిన ప్రమాణాలను పాటించేలా టెలివిజన్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయాలని గత ఏడాది కేంద్రం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రికి లేఖ రాశారు. ఇక.. 2015 నుంచి దూరదర్శన్ ఉచిత డిష్ కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య రెట్టింపు అవుతుంది. దీంతో కేంద్ర కొత్త విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.