Tuesday, November 19, 2024

బీజేపీలో కండువా కప్పుకున్న రోజే పండుగ.. కేసీఆర్ ప్రధానికి ఏకలవ్య శిష్యుడు : రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏకలవ్య శిష్యుడని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ మీటింగ్ ద్వారా తెలంగాణకు జరిగిన నష్టాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తారనుకుంటే సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా కేసీఆర్-మోదీ చీకటి సంబంధాన్ని నిరూపించుకున్నారని రేవంత్ విమర్శించారు. గతంలో మోదీకి అన్ని విషయాల్లో మద్దతిచ్చిన కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక ప్రతిపాదనలు నీతి ఆయోగ్‌కి పంపింనా కేంద్రం పట్టించుకోలేదని ఇప్పుడు విమర్శిస్తున్నారని, జాతీయ స్థాయిలో సరైన ప్రతిపక్ష నాయకత్వం లేకపోవడం వల్ల రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటున్నారని, వివిధ ప్రాజెక్టులు గుజరాత్‌కు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ మంజూరు చేస్తున్నారని, తెలంగాణపై శీతకన్ను ప్రదర్శిస్తున్నారని ఇప్పుడు ఆరోపిస్తున్నారంటూ మండిపడ్డారు.

అర్ధరాత్రి జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు ‘వన్ టాక్స్-వన్ నేషన్’ గొప్ప ఆలోచన అని కేసీఆర్ కొనియాడారని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడున్నరేళ్లలో సీఎం ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించలేదని విమర్శించారు. కానీ ఎప్పుడైతే ప్రజలు మోదీ – కేసీఆర్ ఒకటేనని గుర్తించారో అప్పట్నుంచి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మాటలు వినిపిస్తున్నాయే గానీ చేతలు కనిపించడం లేదని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

మోదీ అడుగుజాడల్లో కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో అక్రమాలు అవినీతిపై పని చేసే విజిలెన్స్, ఈడీ, ఏసీబీ వంటి వ్యవస్థలను ప్రశ్నించే వారిపై ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ విభాగాలను రాజకీయ ప్రత్యర్థులపై వేధింపుల కోసం ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ వంటి సంస్థలను ఎలాగైతే రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారో, అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థలను వాడుతున్నారని ఆయన ఆరోపించారు. వివిధ పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవడానికి మోదీ దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో నిఘా అధికారులను ఇదే తరహాలో రాజకీయాల్లో వినియోగించారన్న ఆయన, మోదీ-కేసీఆర్ ఒకే తాను ముక్కలని అభివర్ణించారు.

ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం
మోదీ ప్రతిపక్షాల సలహాలు, సూచనలు వినట్లేదని విమర్శిస్తున్న కేసీఆర్ అయినా ప్రతిపక్షంగా తాము చేస్తున్న సూచనలను అమలు చేయాలంటూ ఆయన హితవు పలికారు. కేసీఆర్ తాను పాటించి ఇతరులకు చెబితే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో జాతీయ స్థాయిలో నిలదీయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా తెలంగాణకు రావలసిన వాటిని సాధించాలని సూచించారు. లేనిపక్షంలో నరేంద్ర మోదీకి కేసీఆర్ లొంగిపోయినట్టేనని రేవంత్ భాష్యం చెప్పారు. లొంగిపోయి ఒంగిపోతారా లేదా నిలదీసి ప్రశ్నిస్తారా నిర్ణయించుకోండంటూ సవాల్ విసిరారు.

నీతిఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదంటే, కేసీఆర్ నరేంద్ర మోదీకి ఏకలవ్య శిష్యుడేనని నొక్కి చెప్పారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు దేశంలోని ఏ అంశం గురించైనా మాట్లాడవచ్చన్న రేవంత్, ఈ అవకాశాన్ని కేసీఆర్ వినియోగించుకుని దేశవ్యాప్త సమస్యలను ప్రస్తావించవచ్చన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, భావాలను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని చేజార్చడాన్ని తెలంగాణ సమాజం హర్షించదని అభిప్రాయపడ్డారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఫామ్ హౌస్‌లో పడుకుంటారని హాస్యమాడారు. భారీ వరదలతో రాష్ట్రం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో సమావేశానికి గైర్హాజరు కావడమంటే క్షమించరాని నేరమని విమర్శించారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తుందంటూ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు ఆఫర్ ఇచ్చారు.

- Advertisement -

నేనొచ్చాక నూతనోత్తేజం
కష్ట కాలంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతున్నది ఎవరో, వ్యాపార ప్రయోజనాలతో పనిచేస్తున్నది ఎవరో సమాజం గుర్తిస్తుందని స్పష్టం చేశారు. కొన్ని అనుభవంలోకి వస్తేనే తెలుస్తుందని రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి రేవంత్ అన్నారు. ఇప్పుడు వారు చేరుదామనుకున్న పార్టీలో కండువా కప్పుకున్న రోజే పండుగ అని ఎద్దేవా చేశారు. గతంలో పార్టీలో చేరిన కొందరు ఎలాంటి అనుభవాలకు గురయ్యారో, ఎలా బయటికి వచ్చారో అందరూ చూశారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అందులో ఎంతమంది చేరారో, ఎంతమంది బయటకు వచ్చారో లెక్కలు తీయండన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక వచ్చింది నూతన ఉత్సాహమా కాదా అన్నది విశ్లేషించాలని సూచించారు.

చంద్రబాబు చేదయ్యారా?
జార్ఖండ్‌లో కోల్ ఇండియా సంస్థకు చెందిన మైన్, రైల్వే కాంట్రాక్టులు మీకు వచ్చాయో రాలేదో చెప్పండంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ సవాల్ విసిరారు. ఇవన్నీ మీ కంపెనీ సమర్థత చూసే వచ్చాయా అంటూ సవాల్ విసిరారు. 2009లో మీరు నేరుగా వచ్చి ఎంపీకి నామినేషన్ వేశారా లేదా అంతకుముందు ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అని అడిగారు. తద్వారా అప్పటివరకు పార్టీని నమ్ముకుని ఉన్నవారికి నష్టం చేసినట్టా కాదా? అని నిలదీశారు. హిందూ మహాసభ, జన్ సంఘ్ సమయం నుంచి బీజేపీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో ఉన్నారని తెలిపారు.

వారిని కాదని నువ్వెలా పోటీలో నిలబడతావని రాజగోపాల్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు. నాయకత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా సోనియాకు అండగా నిలబడతారా? లేక కుట్ర చేస్తున్న అమిత్ షా పక్కన చేరతారా? అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఆనాడు తెలుగుదేశం కార్యకర్తల సహకారం ఉండబట్టే నువ్వు గెలిచి ఎమ్మెల్యే అయిందన్న ఆయన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేదయ్యారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం నీకు తెలియదా అని అడిగారు. అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం తప్పని ఆయన అంగీకరించారు. శత్రువైనా సరే తప్పుడు పదజాలాన్ని కాంగ్రెస్ సమర్థించదని చెప్పుకొచ్చారు. క్షణికావేశానికి గురైనా, ఉద్దేశపూర్వకంగా అన్నా తప్పేనని ఒప్పుకున్నారు. దానిపై పార్టీ తగిన చర్యలు తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement