Tuesday, November 26, 2024

Medical | ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగవుతున్న పారిశుధ్య వ్యవస్థ.. షిఫ్టుల వారీగా సెక్యూరిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగైంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సేవలు అందాలన్న లక్ష్యంగా ప్రభుత్వం వైద్య శాఖకు ఏయేటి కాయేడు బడ్జెట్‌ను భారీ స్థాయిలో పెంచుతోంది. దీంతో పిహెచ్‌సి మొదలు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు సౌకర్యాలు కూడా అదే రీతిలో అందుబాటులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2015-16లో వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌ రూ.4,932 కోట్లుగా ఉండగా, అది ప్రస్తుతం రూ.12,364 కోట్లకు చేరింది. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సెక్యూరిటీ, శానిటేషన్‌ వ్యవస్థను పటిష్టం చేసింది.

ఆసుపత్రులకు వచ్చే రోగులను క్రమపద్దతిలో వైద్యుల వద్దకు పంపించే విధులను సెక్యూరిటీ సిబ్బంది నిర్వర్తిస్తున్నారు. శానిటేషన్‌ సిబ్బంది ఆసుపత్రుల ఆవరణలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా ఆసుపత్రులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సెక్యూరిటీ, శానిటేషన్‌ సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ పరిశుభ్రతను కాపాడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు శానిటేషన్‌ చార్జీల కింద ఒక్కో బెడ్‌కు రూ.5000 చొప్పున నిధులు కేటాయించేవి. అయితే, ఆసుపత్రులలో మెరుగైన శానిటేషన్‌ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆ చార్జీలను ఒక్కో బెడ్‌కు రూ.7500 చొప్పున పెంచింది.

దీంతో శానిటేషన్‌ సిబ్బందికి ప్రతీ నెలా సక్రమంగా వేతనాలు అందుతున్నాయి. దీంతో పాటు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్‌ సిబ్బందికి ఏజెన్సీలు ప్రతీ నెలా వేతనాలు 15 తేదీలోగా అందించడంతో పాటు సిబ్బంది వేతనం నుంచి కట్‌ చేసిన అంతే మొత్తాన్ని పిఎఫ్‌ను వారి ఖాతాలో జమ చేస్తున్నాయి. దీంతో గతంలో మాదిరిగా సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారు. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన విభాగాధిపతులు విధులు నిర్వర్తించే కార్యాలయాలు, పరిసరాలలో సైతం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement