తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మొన్నటి వరకు వెయ్యి లోపు వచ్చిన కేసులు.. ఇప్పుడు మూడు వేలకు పెరిగింది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కరోనా విజృంభించడంతో రాష్ట్రంలోని పలు గ్రామాలు లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. కేసులు పెరుగుతున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగా కూడా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టము అని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అయినా ప్రజల్లో మాత్రం లాక్ డౌన్ భయం వెంటాడుతూనే ఉంది. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుల్ టైమ్ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ప్రశ్నించగా.. లాక్ డౌన్ అనేది మంచి ఐడియా కాదని తాను భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. 2021లో లాక్ డౌన్ వద్దు అనే కోరుతున్నాం అంటూ తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. కరోనా కేసులు తగ్గాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. లాక్ డౌన్ కావాలో… మాస్కులు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.
కాగా, ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని చెప్పిన సంగతి తెలిసిందే.