Friday, November 22, 2024

చిన్ననీటి పారుదల రంగానికి ప్రాముఖ్యత.. చెక్‌ డ్యాంల నిర్మాణాలకు కేటాయింపులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణా నదీజలాల వాటా తేల్చడంలో కేంద్రం జాప్యం చేస్తుండటంతో చిన్ననీటిపారుదలప్రాజెక్టులు, చెక్‌ డ్యాంల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర 2023-2024 బడ్జెట్‌ కేటాయింపులుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు. కొత్తగా నిర్మించ బోయో కేశవపూర్‌, చర్లగూడెం రిజర్వాయర్ల కు భారీ కేటాయింపులు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గత బడ్జెట్‌లో రూ. 22691 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ అంచెనావ్యయాలు పెరగడంతో బిల్లులు పెండింగ్‌ లో ఉన్నయి. అయితే 2023-2024 బడ్జెట్‌ లో పెండింగ్‌ బిల్లులకు కూడా కేటాయింపులు ఉండనున్నాయి. గద్వాల రిజర్వాయర్‌తోపాటుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగమార్గాల నిర్మాణాలకు ఈ బడ్జెట్‌లో నిధులు ఉండనున్నట్లు సమాచారం.

ఉత్తర తెలంగాణలో గోదావరినదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు చివరిదశకు చేరుకోవడంతో పెండింగ్‌ బిల్లులు అంచెనాకు మించి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనలో గమనించింది. ప్రస్తుత బడ్జెట్‌ నీటిపారుదల రంగంలో ని పెండింగ్‌ బిల్లుల చెల్లింపులతోపాటుగా చిన్న నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులకేటాయింపు ఉంటుందని తెలిసింది. రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న వందలాధి చెక్‌ డ్యాంలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేందుకు నిధుల కొరతతీర్చాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో కేటాయింపులు చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా నీటి వాటాల్లో గందరగోళ పరిస్థితి నెలకొని ఉండటం, ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడం, కేంద్రం సహకరించకపోవడంతో ప్రస్తుతం దక్షిణ తెలంగాణలో విస్తృతంగా చెక్‌ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఇప్పటికే చెక్‌ డ్యాంల నిర్మాణాలు చేపట్టింది. మరో 12వందల చెక్‌ డ్యాంలకు డిమాండ్‌ ఉండటంతో ఈ మేరకు డిపిఆర్‌ లను అధ్యయనం చేస్తుంది. ఒక చెక్‌ డ్యాం నిర్మాణంలో సుమారు ఒక కిలో మీటరు పరిధిలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని జలనిపుణులు ఇచ్చిన అధ్యయన నివేదికలను ఇప్పటికే నీటిపారుదల శాఖ పరిశీలించి కొత్తగా చెక్‌ డ్యాంల నిర్మాణాలు చేపట్టాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలను పంపింపించింది. ఈ ప్రతిపాదనల మేరకు 2023-24 బడ్జెట్‌ లో చెక్‌ డ్యాంల నిర్మాణాలకు భారీ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెక్‌ డ్యాల నిర్మాణాలకు సుమారు రూ. 20,000ల కోట్ల ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు చిన్న నీటి పారుదలకు సంబంధించి కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. చిన్న నీటి వనరుల ఉత్పాదనకు ఇప్పటికే నాబార్డు రూ. 2006 కోట్లు ఇచ్చేందుకు ముందుకువచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రణాళిక నిధులు, ప్రణాళికేతర నిధుల కింద నాబార్డు నిధులకు సమాంతరంగా నిధులు కేటాయించాలని భావిస్తోంది. ఇప్పటివరకు నాబార్డు రూ.900కోట్ల రుణం ఇచ్చినట్లు సమాచారం. నిర్మాణ దశలో ఉన్న చిన్న నీటి పారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 1,916 కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం.

అలాగే చెక్‌ డ్యాంల నిర్మాణానికి సంబంధించిన గుత్తేదారుల బిల్లులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్‌ పనులకోసం భారీ నిధులు కేటాయించి దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే అలోచనతో ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయని తెలిసింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం నీటి పారుదల రంగంలో ఆపరేషన్‌ మెయింటనెన్స్‌( ఓ అండ్‌ ఎం) విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఓ అండ్‌ ఎం ప్రతిపాదనల్లో సూమారు రూ. 400కోట్లు ఉన్నట్లు తెలిసింది. అలాగే ముగిసిన అర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరాంతానికి రుణాల చెల్లింపులు, కొత్తప్రాజెక్టులు, వేతనాలు, బిల్లుల చెల్లింపులకోసం భారీ కేటాయింపులు ఉంటాయని నీటిపారుదల శాఖ వర్గాలు అంచెనా వేస్తున్నయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement