Saturday, November 9, 2024

India: రష్యా నుంచి చమురు దిగుమతులు.. భారత్​కు 35 వేల కోట్లు ఆదా

రష్యా నుంచి డిస్కౌంట్‌ ధరకు ముడి చమురును దిగుమతి చేసుకున్న భారత్​కు 35 వేల కోట్ల వరకు లాభపడింది. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మన దేశం రష్యా నుంచి భారీ ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో పాటు, దాని మిత్ర దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మన దేశం వెనక్కి తగ్గలేదు. మన ఆర్ధిక వ్యవస్థకు ఏది మేలో దాన్ని అనుసరించే వెసులుబాటు, హక్కు తమకు ఉన్నాయని ఈ విషయంలో వ్యతిరేకిస్తున్న దేశాలకు భారత్‌ గట్టి సమాధానం చెప్పింది.

రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా అగ్రభాగాన ఉంటే, మన దేశం రెండో స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు మొత్తం మన దేశ చమురు అవరసరాల్లో 1 శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం ఇది 12 శాతానికి పెరిగింది. అంతకు ముందు మన దేశం సౌదీ అరేబియా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునేది. జులైలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశం 2వ స్థానానికి చేరింది. ఆగస్టులో మాత్రం సౌదీ అరేబియా 2వ స్థానానికి చేరింది. రష్యా 3వ స్థానంలో నిలిచింది.

ఏప్రిల్‌-జులై మధ్యలో రష్యా నుంచి మన దేశం చమురు దిగుమతులు 11.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 1.5 బిలియన్‌ డాలర్లు మాత్రమే. మన దేశం మొత్తం చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. 2021-22 సంవత్సరంలో మన దేశ దిగుమతులు రెట్టింపు అయి 119 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగానే మన దేశం తక్కువ రేటుకు వచ్చే రష్యా చమురును కొనుగోలు చేసింది. వాస్తవంగా చూస్తే ప్రభుత్వం నేరుగా చమురును కొనుగోలు చేయడంలేదు. కంపెనీలు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాయి.

రేటు తక్కువకు వస్తున్నందున దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చమురు దిగుమతుల బిల్లు తగ్గితే ఆ మేరకు మన విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. డాలర్‌ డిమాండ్‌ తగ్గుతుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ భారం తగ్గుతుంది. 2020లో కరోనా వచ్చిన సమయంలో ప్రపంచ మంతా లాక్‌డౌన్‌ సందర్భంలో చమురు ధరలు భారీగా తగ్గాయి. దీంతో మన దేశం భారీగా చమురు నిల్వ చేసింది. దీని వల్ల 25 వేల కోట్లు ఆదా అయ్యింది. తరువాత కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర పెరిగింది. మన దేశంలోకి రష్యా నుంచి చమురు దిగుమతులు ప్రస్తుతం భారీగానే జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement