న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఐదు రాష్ట్రాల్లోని 2,579 గ్రామాల్లో ఉజాలా పథకాన్ని అమలుచేయబోతున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత చౌకగా గ్రామీణ ప్రాంతాల్లో 10 రూపాయలకే ఎల్‌ఈడీ బల్బులు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉజాల యోజన పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ తెలిపారు. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు గురువారం ఆయన బదులిచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణాల్లో రెండున్నర వేలకు పైగా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపాదికన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి వివరించారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమవడంపై ప్రాజెక్టు విస్తరణ ఆధారపడి ఉంటుందని రాజ్‌కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.