Saturday, November 23, 2024

TS | హామీలు అమలు చేయమంటే బెదిరింపులా.. రేవంత్ సర్కారుపై కేసీఆర్ ఆగ్రహం

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు అలవిగాని హామీలిచ్చి, గ్యారంటీల పేరుతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం మాట మార్చిందన్నారు. తాము సమయంతో సహా ప్రకటించి, ప్రమాణపూర్వకంగా ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే.. సమాధానమివ్వడం చేతకాక నాలిక మడతేసి అబద్దాలకు బెదిరింపులకు దిగి తప్పించుకుంటున్నదన్నారు.

తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గాల ముఖ్యనేతలతో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రత్యర్థుల దుష్ప్రచారాలకు ప్రభావితమై తమకు మంచిచేసే బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ఇట్లా తమకోసమే పని చేసే ప్రభుత్వాలను దూరం చేసుకున్న సందర్భాలు చరిత్రలో ఉన్నాయని వివరించారు. తాము మోసపోయిన సంగతిని గ్రహించి ఆ తర్వాత కొద్దికాలంలోనే వాస్తవాలను తెలుసుకుని తిరిగి ఆదరించారని అన్నారు.

ఇదే నేపథ్యంలో తాము గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగునీరు, కరెంటు వంటి కనీస అవసరాలను తీర్చలేక పోవడంతో తెలంగాణ ప్రజలు విస్మయం చెందుతున్నారని తెలిపారు. తమకు కొత్తగా ఇచ్చే తెలివి లేకున్నా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కూడా కొనసాగించలేక తన పాలనలోని డొల్ల తనాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ బయటేసుకుంటు ప్రజల్లో అభాసుపాలవుతున్నదని అన్నారు.

- Advertisement -

గెలుపు ఓటములు సహజమని ప్రజాక్షేత్రంలో వుంటూ వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని నాయకులకు స్పష్టం చేశారు. నాటి ఉద్యమకాలం నుంచీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నదని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని పిలుపునిచ్చారు.

తాను పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని గుర్తు చేసారు. ఎంతో ఘనంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను పాలమూరులో అమలుచేసినామన్నారు. పాలమూరు నీటిగోసను తీర్చేందుకు , ఉద్యమ సారధిగా తాను చేసిన పోరాటాలను., నాటినుంచి కరువుకోరల్లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. నీళ్లు లేక సాగులేక నాడు బండలా ఉన్న పాలమూరును సస్యశ్యామలం చేసి పచ్చని పంటలతో ధాన్య రాసులతో బంగారి కొండలా అభివృద్ధి చేశామన్నారు.

నాటి కాంగ్రేస్ సహా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిలబడిపోయిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటున్నదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తి పోతల పథకం ద్వారానే కొడంగల్ కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చని అట్లా కాకుండా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్లుకు లిఫ్ట్ ను మార్చడం సరియైన నిర్ణయం కాదని కేసీఆర్ అన్నారు. ఇటువంటి అనేక అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెప్తారని అన్నారు.

పాలమూరు పార్లమెంటు అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి :

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గ అభర్ధిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను అనుసరించి మన్నె శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. కాగా .. ముఖ్యనేతలతో మరోసారి చర్చించి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు పలువురు ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement