Tuesday, November 26, 2024

Delhi | “కోర్డ్ ఆఫ్ వార్డ్స్” చట్టాన్ని అమలు చేయండి.. తెలంగాణ, కర్ణాటక సీఎంలకు గోనె ప్రకాశ్ సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత పాలకులు విస్మరించిన శక్తివంతమైన చట్టాన్ని అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి తగినన్ని నిధులు సమకూర్చుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు తెలిపారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. బ్రిటీష్ పాలన సమయంలో తీసుకొచ్చిన “కోర్ట్ ఆఫ్ వార్డ్స్” చట్టం గురించి వివరించారు. ఈ చట్టం ప్రకారం దేశంలో 560 రాజకుటుంబాలను నాటి బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించిందని, తద్వారా ఆ రాజకుటుంబాలకు చెందిన విలువైన ఆస్తులను పరిరక్షించి, వారసులకు అప్పగించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని తెలిపారు.

ఈ చట్టం ప్రకారం రాజకుటుంబీకుల వారసులకు మైనారిటీ తీరగానే వారి ఆస్తులను తిరిగి అప్పగించాల్సి ఉంటుందని వివరించారు. అయితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకుటుంబాలకు చెందిన ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయని, ఈ రాష్ట్రాల్లో గత పాలకులు ఎవరూ కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో ‘పైగా’ కుటుంబం, జాఫర్‌ఖాన్ కుటుంబం సహా ఇంకా పలువురు రాజకుటుంబాలకు చెందినవారి ఆస్తులు పెద్ద మొత్తంలో ఉన్నాయని, అవన్నీ అక్రమమార్గాల్లో కొంతమంది వ్యాపారవేత్తలు, బడాబాబులు హస్తగతం చేసుకున్నారని తెలిపారు.

చట్టాన్ని అమలు చేస్తే ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవచ్చని తెలిపారు. వారసత్వాన్ని నిరూపించుకున్నవారికి ఆస్తులను తిరిగి అప్పగించవచ్చని, ఈ క్రమంలో పలువురు రాజకుటుంబీకులు తమకు చెందాల్సిన ఆస్తులను తిరిగి అప్పగిస్తే సగభాగం రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లక్షల కోట్ల విలువ చేసే ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వేల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని గోనె ప్రకాశ్ రావు అన్నారు.

- Advertisement -

పైగా ప్యాలెస్ సహా మొత్తం 140 ఎకరాల స్థలం వారి వారసుల కోసం విడుదల చేస్తూ 2008లోనే ఉత్తర్వులు వచ్చాయని, కానీ ఆ విలువైన ఆస్తులన్నీ కొంతమంది బడాబాబుల అక్రమాధీనంలో ఉన్నాయని గోనె ప్రకాశరావు ఆరోపించారు. సుమారు 20 రాజకుటుంబీకులు జాఫర్‌ఖాన్ నేతృత్వంలో ఒక బృందంగా ఏర్పడి త్వరలో ఢిల్లీకి రానున్నారని, ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’ చట్టం ద్వారా వారి ఆస్తులను తిరిగి అప్పగిస్తే ప్రభుత్వానికి కూడా దండిగా ఆదాయం సమకూరుతుందని గోనె ప్రకాశరావు అన్నారు. అవసరమైతే ప్రత్యేక విమానాన్ని తాను ఏర్పాటు చేసి వారసులు నివసిస్తున్న యూకే సహా వివిధ దేశాలకు వెళ్లి సంప్రదింపులు జరుపుతానని తెలిపారు.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆర్థికభారాన్ని మోపే హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలంటే తాను చేసే సూచన ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చాలా బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన గోనె ప్రకాశ్, తొలి పరిచయంలోనే రేవంత్ రెడ్డిని చిచ్చరపిడుగుగా అభివర్ణించానని చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందిగా రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా కోరుతున్నానని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement