ఏప్రిల్ 26నాటికి భారత్‌లో 202.7 గిగా వాట్స్ ఉత్పత్తి సామర్థ్యంతో 165 బొగ్గు ఆధారిత ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్స్‌లో 66.32 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. 21.44 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. దేశీయంగా బొగ్గును ఉపయోగించే 150 బొగ్గు విద్యుత్ ప్లాంట్స్‌లో 85 ప్లాంట్స్‌లో బొగ్గు తక్కువగా ఉంది. దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగించే 15 ప్లాంట్స్‌లో 12 ప్లాంట్స్‌లో బొగ్గు కొరత ఉంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) డేటా ప్రకారం.. విద్యుత్ ప్లాంట్‌ను కేంద్రం, రాష్ట్రాలు, జాయింట్ వెంచర్లు లేదా ప్రైవేటుగా నిర్వహిస్తున్నా.. దేనితో సంబంధం లేకుండా బొగ్గు కొరత కనిపిస్తుంది. దేశం అంతటా పెరుగుతున్న ఉష్ణోగ్రత చాలా మంది ప్రజలను కలవరపెడుతున్నది. విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయకుండా రాష్ట్రాన్ని ఎలా అడ్డుకుంటారని ప్రతిపక్ష సీఎంలు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.
తగ్గుతూ వస్తున్న నిల్వలు..
బొగ్గు కొరతపై కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి దారితీస్తున్నాయి. బొగ్గు కొరత లేదని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ వద్దరైల్వే వ్యాగన్లు లేవని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతున్నది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరిగింది. దీంతో పవర్ ప్లాంట్లు దేశీయ బొగ్గును ఉపయోగించడం ప్రారంభించాయి. కానీ బొగ్గు గనులకు, ప్లాంట్లు దూరం ఉండటంతో సమస్య తలెత్తుతున్నది. పవర్ ప్లాంట్స్లోని విద్యుత్ ఉత్పత్తిదారుల బొగ్గు నిల్వలు 2014 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. భారత్.. ప్రపంచ వ్యాప్తంగా మూడో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉంది. అయితే తలసరి వినియోగంలో 106వ స్థానంలో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..