Tuesday, November 26, 2024

ప్రపంచ దేశాలపై ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రభావం.. ధరల పెరుగుదల, ఆహార ధాన్యాల కొరత

ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రభావం కేవలం ఐరోపా సమాఖ్యకే పరిమితం కాబోదని, ప్రాంతీయంగాను, ప్రపంచ దేశాలపైనా విస్తృతంగాను, ప్రతికూలంగాను ఉంటుందని భారత్‌ అభిప్రాయపడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఐరాసలోని భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి ఆర్‌.రవీంద్ర మాట్లాడుతూ రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్‌లో నెలకొన్న విధ్వంసం, అమానవీయ సంఘటనలను ప్రస్తావించారు. అలాంటి పరిస్తితులు శాంతి, సుస్థిరతల, సామరస్యాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలసిమెలసి జీవించగలిగే పరిస్తితులను కల్పించే ప్రజాస్వామ్య విధానాల పట్ల భారత్‌ విశ్వాసంతో ఉందని, ఉక్రెయిన్‌లోనూ ఆ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.

యుద్ధం వల్ల ప్రాంతీయ, ప్రపంచ దేశాల్లో అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని, ఇంధన ధరలు పెరగవచ్చని, ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత ఏర్పడబోతోందని హెచ్చరించారు. ప్రత్యేకించి ఈ యుద్ధం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్న పొరుగు దేశాలకు భారత్‌ సహాయపడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరగాలని భారత్‌ అభిలషిస్తోందని, ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపట్ల విచారం వ్యక్తం చేసిన రవీంద్ర ఐరాస చీఫ్‌ పేర్కొన్న విధంగా ఉక్రెయిన్‌లో అకృత్యాలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement