Saturday, November 23, 2024

రాఘవేంద్ర ఎత్తిపోతల ద్వారా అక్రమంగా నీటి తరలింపు.. ఏపీ చర్యలను అడ్డుకోండి

నీటి కేటాయింపులు లేకున్నా అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం పేరుతో కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని, వెంటనే ఆ చర్యలు తీసుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల ఈఎన్‌సీ సీ మురళీధర్‌ మంగళవారం కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం పేరుతో 5.373 టీఎంసీల నీటిని తుంగభద్రా కుడి కాలువ నుంచి తరలించుకుపోతోందని ఆరోపించారు. మొత్తం 13 ఎత్తిపోతలను కలిపి గురు రాఘవేంద్ర పథకం కింద చూపుతున్నారని ఫిర్యాదు చేసింది. తుంగభద్రపై ఆర్‌డీఎస్‌ దిగువ నుంచి మొదలు సుంకేసుల బ్యారేజీ వరకు ఈ 13 ఎత్తిపోతల ద్వారా గురు రాఘవేంద్ర లిఫ్ట్‌ పేరుతో అక్రమంగా ఏపీ నీటిని తరలించుకుపోతోందని విమర్శించారు. ఈ పథకానికి ఎలాంటి నీటి కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. గురు రాఘవేంద్రతోపాటు 13 ఎత్తిపోతలు అక్రమమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వెంటనే కేఆర్‌ఎంబీ స్పందించి తుంగభద్ర నుంచి అక్రమంగా ఏపీ నీటిని తరలించుకుపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేఆర్‌ఎంబీ లేదంటే సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిళ్లు నీటి కేటాయింపులను జరిపేదాకా గురు రాఘవేంద్ర ద్వారా నీటి తరలింపు అక్రమమేనని తేల్చి చెప్పారు. ఈ పథకం పేరుతో ఇప్పటిదాకా తరలించుకుపోయిన నీటికి ఏపీ ప్రభుత్వం లెక్కలు చూపేవిధంగా చర్యలు తీసుకోవాలని బోర్డును కోరారు. గురు రాఘవేంద్ర లిఫ్ట్‌ తాలూకు మ్యాప్‌ను లేఖకు జతచేశారు.

ఆర్‌డీఎస్‌ జలాల పంపిణీ కేడబ్ల్యూటీ 1కు విరుద్ధం…

ఆర్‌డీఎస్‌ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య 10:7 నిష్పత్తిలో పంపిణీ చేయాలని కేఆర్‌ఎంబీ తీసుకున్న నిర్ణయం కృష్ణా వాటర్‌ డిసిప్యూట్‌ ట్రిబ్యునల్‌-1లోని నిబంధనలను అతిక్రమించేలా ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయమై మంగళవారం ఈఎన్‌సీ మురళీధర్‌ కేఆర్‌ఎంబీకి మరో లేఖ రాశారు. కృష్ణా నదిపైనున్న రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ మాత్రమేనని, అది డిస్ట్రిబ్యూషన్‌ స్కీమ్‌ కాదని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్కీం నుంచి తెలంగాణ వాటాగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని గడిచిన మూడు దశాబ్దాలుగా పొందలేకపోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాజోలిబండ ఆనకట్టను కేఆర్‌ఎంబీ తన పరిధిలోకి తీసుకుని.. తెలంగాణ వాటా జలాలను కేటాయించాలని బోర్డును కోరారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌డీఎస్‌ ఆనకట్ట తనిఖీ, అధ్యయనానికి కేఆర్‌ఎంబీ బృందం వెళ్లిన సందర్బంలో… ఆర్‌డీఎస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ వైపు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా నది నుంచి ఏ మేరకు ఇసుక మేట వేసింది, తదితర అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. ఆర్‌డీఎస్‌ ఆనకట్ట పూర్తిసామర్థ్యానికి నీటిమట్టం చేరినపుడు ఆర్‌డీఎస్‌ కెనాల్‌, కామన్‌ కెనాల్‌ సామర్థ్యం మేరకు 770 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా పరిస్థితులు ఉన్నాయా..? లేదా కూడా పరిశీలించాలన్నారు. ఆర్‌డీఎస్‌ మోడర్నైజేషన్‌ పనుల్లో భాగంగా ఆర్‌డీఎస్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంటే పరిశీలించాలని, ఆ మేరకు డిజైన్లను రూపొందించాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement