Sunday, November 17, 2024

కరిగిపోతున్న గుట్టలు.. మట్టి అమ్ముకుని కోట్లు గడిస్తున్న వ్యాపారులు

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌ : కొంతమంది మట్టిని నమ్ముకొని జీవనోపాధి పొందుతుంటే, మరికొంతమంది మట్టిని అమ్ముకొని కోటీశ్వరులు అవుతున్నారు. ప్రభుత్వ అసైన్డ్‌ భూములల్లో అనుమతులు లేకుండా రాత్రి పూట ఎర్రమట్టి, నల్లమట్టి, మొరం త్రవ్వకాలు జరుపుతున్నారు. ఈ మట్టి దందా మాఫియా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఈ వ్యాపారం కాసులు కురిపిస్తోంది. మట్టి తరలింపు వ్యాపారాన్ని మొదలు పెట్టిన తక్కువ కాలంలో కోటీశ్వరులవుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా జోరుగా మట్టి వ్యాపారం కొనసాగుతోంది. ఇళ్ల నిర్మాణాలతోపాటు రోడ్లు వేసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సమీపంలోని అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములనుండి పెద్దఎత్తున మట్టిని, మొర్రాన్ని తరలిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల సహకారంతో మట్టి తరలింపు దందా జోరుగా కొనసాగుతోంది. ప్రధాన రోడ్ల వెంబడి మట్టి, మొరం లారీలు వెళ్తున్నా పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. మట్టి, మొరం తరలిస్తే మైనింగ్‌ శాఖకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అవేమి లేకుండానే రెండు శాఖలకు చెందిన అధికారులను ప్రసన్నం చేసుకుని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

కందుకూరులో జోరుగా వ్యాపారం..

కందుకూరు మండలంలోని పులి మామిడి, తిమ్మాపూర్‌, దాసర్లపల్లి, గుమ్మడవెళ్లి, నేదునూరు, గూడూరు, బేగం
పేట్‌, మాదాపూర్‌ లేమూరు, అన్నోజీగూడ, బెగరికంచే, మీర్కాన్‌ పేట్‌, చిప్పలపల్లి గ్రామాలలో రాత్రి పూట అక్రమార్కులు ఎర్రమట్టి, మొరం, నల్లమట్టిని తొవ్వుకో అమ్ముకో అన్న చందంగా మట్టి దందా జోరుగా నడిపిస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. రాత్రికి రాత్రే గుట్టలు మాయం అవుతున్నాయి అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement