Friday, October 18, 2024

అక్రమ మట్టి దందా..

అక్రమ మట్టి దందా పెద్దపల్లి మండలంలో యదేచ్చగా సాగుతోంది. ఇటుక బట్టీల పేరిట మట్టి తరలింపుకు అనుమతి పొంది అక్రమ మట్టి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్‌లో ఐదు ఇటుక బట్టీల పేరిట 76,400 టన్నుల మట్టి తరలింపుకు అనుమతి పొందగా, కొత్తపల్లి చెరువులో మట్టి తరలింపు కోసం ఐదు ఇటుక బట్టీల పేరిట 44,476 టన్నుల తరలింపు కోసం రాయాల్టి కట్టిన వ్యాపారులు ఇప్పటికే 12లక్షల టన్నులకు పైగా మట్టిని తరలించారని పెద్ద ఎత్తున ఆరోపణలు విన వస్తున్నాయి. సుమారు 600 లారీలలో మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో వేబిల్‌ పైన 10 లారీలకు పైగా మట్టిని తరలిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మట్టి తరలింపును పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ ఈ ఏడాది ప్రత్యేకమైన పాలసీని తీసుకువచ్చినా దోపిడీ మాత్రం ఆగడం లేదు. గల్లి నుంచి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులతోపాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు, పలు శాఖల అధికారులకు పెద్ద ఎత్తున స్థాయిని బట్టి లక్షల్లో మట్టి తరలింపు కోసం మామూళ్లు ముట్టజెప్పడంతో అక్రమ దందాను అడ్డుకునే వారే కరువయ్యారు. చెరువుల నుంచి తీసిన మట్టిని ఇటుకల తయారీ కోసం బట్టీల వద్దకు తరలించాలని నిబంధనలు ఉన్నా వ్యాపారులు మాత్రం రాఘవాపూర్‌, దేవునిపల్లి దారిలో కెనాల్‌ను ఆనుకొని వ్యవసాయ భూముల నిండా మట్టిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. లారీలతోపాటు వందలాది ట్రాక్టర్లలో నిబంధనలకు విరుద్దంగా మట్టిని తరలిస్తున్నారు.

సాయంత్రం 6గంటల తర్వాత మట్టి తవ్వకాలు, తరలింపు చేయరాదనే నిబంధనలు ఉన్నా అక్రమార్జనే ధ్యేయంగా 24 గంటలపాటు మట్టిని తరలిస్తున్నారు. ఓవర్‌ లోడ్‌తో మట్టి వెళ్తున్నా అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో ఊగిసలాడుతున్నారు. రాఘవాపూర్‌లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్రమ మట్టి దందాకు తెరలేపగా, కొత్తపల్లిలో అధికార తెరాసతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అక్రమ మట్టి దందాను ఇటుక బట్టీల పేరిట కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో లారీ మట్టిని వేలాది రూపాయలకు విక్రయిస్తున్నా అధికారులకు కానరాకపోవడం ఎంత మేర మామూళ్లు ముట్టాయో తెలిపేందుకు నిదర్శనం. కొత్తపల్లి చెరువులో తీసిన మట్టి సైతం సమీప వ్యవసాయ భూముల్లో నిల్వ చేస్తున్నారు. నిబంధనలను కాలరాస్తున్నారని ప్రశ్నించిన వారందరికి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కుమ్మరిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది. జిల్లా కలెక్టర్‌ అక్రమ మట్టి దందాపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరువుల్లో తవ్విన మట్టిపై విచారణ జరిపితే పెద్ద ఎత్తున జరిగిన అవినీతి బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. బట్టీల వద్ద కుప్ప కుప్పలుగా పోసిన మట్టిని, వ్యవసాయ భూముల్లో నిల్వ ఉంచిన మట్టిని పరిశీలిస్తే ఏ మేర అక్రమాలు జరిగాయో తెలిసే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులతోపాటు అన్ని శాఖల అధికారులు మామూళ్ల మత్తు వీడి అక్రమ మట్టి దందాపై కొరఢా ఝుళిపించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement